డెంగ్యూ జ్వరకారకం
డెంగ్యూ జ్వరకారకం
అమ్మా....మహాతల్లీ నీకు
వంగి వంగి దండం పెడతాం
నింగి వైపు వెళ్లిపో..లేదా
నేలలో కూరుకుపో...కానీ
మా జోలికి మాత్రం రాబోకు
మొన్న మలేరిరయా...
నిన్న టైఫాయిడ్... నేడు
డెంగీ ఇదేమి వింత తల్లి
నిను పెంచి పోషించిన వారినే
కాటేసి వైద్యానికి పంపుతావా
నిను చూడగానే నిజం తల్లీ
జ్వరం జరజరా వస్తుంది
రాత్రి అయితే టైం వేష్టని పగలే
కుట్టి కునుకు తీస్తావట!
ఏమి తల్లీ కనికరమే లేదా
ఉన్నవాడికీ... లేనివాడినకీ
లేనిపోని ఇబ్బందులు పెట్టి
మురికి వాడల్లోనే నీ పెత్తనం
ఏసీ గదుల్లో నీ ఉనికే ఉండదు
ఖర్చులు మాట ఆటంచు
కీ టోన్స్ పడిపోయి భయం
భయకంపితులమౌతున్నాం
బొప్పాయితో నీముప్పు తొలగు
నిన్ను ముప్పుతిప్పలు పెట్టే
ఆకు రసాలు వస్తున్నాయి
నీకు కొన్ని ఆసుపత్రులుతో...
ఒప్పందాలట నిజమేనా...!
వైద్యులు కొంతమందికి కాసులు
మాకు నిరాశలు ఎందుకమ్మా!
నీ పంతాలూ పట్టింపులూ
తొలగిపో... పారిపో దూరంగా
అదిగో వేస్ట్ ఆయిల్ బాల్స్
నీ పాలిట యమపాశాలు
ఇదిగో స్వచ్చభారతి పనులు
నిన్ను మట్టు పెట్టి మట్టిలో...
కుమ్మేసే కార్యక్రమాలు చూడు
హంగామా వదిలి వెళ్లిపో...
పేదసాదల సాదకబాధలు నేడు
నిన్ను గురిపెట్టక మానవు
డెంగీ కారక దోమని నీకు నింద!
నీ వారూ నిన్ను దూరం పెట్టి
దూరంగా జరిగి పోతున్నారట!
ఇక మమ్మల్ని వదిలి బుద్దిగా
బుజ్జి బుజ్జిగా మాయమైపో..
పో..పో...మాయదారి భామా
ఈ భువికి దూరంగా ఎగిరిపో
మోకాళ్ళు క్రిందనే కుడతావట
మురికికుంటల్లో జతకడతావట
నీ చరిత్ర మొత్తం హీనమే...
చూడ చక్కని రూపవతివే...
పాపం మూటగట్టుకుంటావా!
పుట్టిన నుండి చచ్చేవరకూ
నీ జీవితమంతా గందరగోళం
దోమల్లోనూ చెత్తదోమగా ...
విషపురుగులా చీదరింపులు
ఛీ... నీ జన్మ పాడుగానూ...
వదిలిపోవే ఈ లోకాన్ని.
ప్రాణాలు పోయి కొందరు
ప్రాణాపాయంలో ఇంకొందరు
ప్రాణభయంతో మరికొందరు
ఎందరితో తిట్లు కాస్తావూ...!
డబ్బులు ఊరకనే రాలిరావు
కావాలంటే 'అల్లతన్ని' అడుగు
నువ్వు తెస్తున్న జ్వరాన్ని తలిస్తే
చలి జ్వరం వచ్చేటట్లు ఉంది
నీ పుణ్యముంటుంది వెళ్లిపో..
మరెప్పుడూ రావద్దు...వద్దు
వీడ్కోలు తీసుకో మౌనంగా
కానరాని లోకాల్లో కలిసిపో
కదిలిపో...కరిగిపో "ఆయిల్లో"
.