మార్గదర్శి
మార్గదర్శి


అతడి చేయిపట్టి నడుస్తుంటే
దారంతా బాల్యజ్ఞాపకాల వసంతాలను పూయిస్తాడు
చిరునవ్వుల విత్తులతో ఊరంతా
అభిమానాల పంటను పండించే
రైతును చేస్తాడు
చెరువుగట్టులతో మామిడి చెట్టులతో
స్నేహానికి ఊపిరి పోస్తాడు
వెన్నెలరాతిరిలో నులకమంచంపై
కథల ఊయలలో ఓలలాడిస్తాడు
విక్రమార్కభేతాళులతో నిశీధిలో పయనించేస్తూ
వికటకవితో వికటాట్టహాసం చేయిస్తాడు
జామచెట్టుకు నీరునుపోస్తూ
ఎగిరిగెంతే ఉడుతపిల్లతో కబుర్లు చెబుతాడు
గులాబీ మొక్కకు పాదునుచేస్తూ
గుమ్మడికాయ వడియాలగురించి నోరూరించేస్తాడు
నవయువకుడు మనసునాదంటూ అల్లరి చేస్తాడు
ఇంతలో అరవైఏళ్ళ పెద్దమనిషయిపోయి సుద్దులుచెబ్తూ
తాతనునేనంటూ గుర్తుచేస్తాడు
మళ్ళీ ఆటలాడే సమయంలో
మాలో ఒకడైపోతూ మర్రిచెట్టునీడలో
తామాడిన ఆటలజ్ఞాపకాలను నెమరేసుకుంటాడు
లేగదూడల కన్నుల్లోని నిర్మలత్వాన్ని
మనసునిండా నింపేస్తూ
తాతకు తగ్గ మనమలంటూ
ఊరంతా బుగ్గలు పుణుకుతుంటే
కొండంతగర్వాన్ని మోములో దాచేస్తాడు
మంచిచెడుల వ్యత్యాసాన్ని
అనుభవపాఠమై రుచిచూపిస్తాడు
పాతవాసనల గొప్పదనాన్ని
ఆవకాయపచ్చడంత ఘాటుగా
జీవితపుస్తకంలో లిఖించేస్తాడు