ఎల్లమ్మ కూతురా
ఎల్లమ్మ కూతురా


మొక్కజొన్న తోట కాదా మంగమ్మ మన్మడా
కంకి కోసి తెస్తావా మంగమ్మ మన్మడా !!
ఎంకిలాగ నువ్వుండా ఎల్లమ్మ కూతురా
కంకి ఊసు ఎందుకె ఎల్లమ్మ కూతురా !!
మల్లెపూల తోట కాదా మంగమ్మ మన్మడా
పూలుకోసి తెస్తావా మంగమ్మ మన్మడా !!
పువ్వులాటి నవ్వు నీది ఎల్లమ్మ కూతురా
నీకు పూలతోని ఏమి పని ఎల్లమ్మ కూతురా !!
బాటసింగారం కేనచి మంగమ్మ మన్మ డా
బంగారు గొలుసు తెస్తావా మంగమ్మ మన్మడా !!
సిగ్గు నీకు సింగారం ఎల్లమ్మ కూతురా
నీకు బంగారమెందుకే ఎల్లమ్మ కూతురా !!
బోనాల పండుగకు మంగమ్మ మన్మ డా
బొట్టు కాటుక తెస్తావా మంగమ్మ మన్మడా !!
చందమామ అందమున్న ఎల్లమ్మ కూతురా
బొట్టు కాటుక ఎందుకె ఎల్లమ్మ కూతురా !!
గరికపాడు గేట్ కాడ మంగమ్మ మన్మ డా
గవ్వ గురుగు కొంటావా మంగమ్మ మన్మడా !!
గువ్వలాగా నువ్వుండ ఎల్లమ్మ కూతురా
గవ్వ ముచ్చటెందుకే ఎల్లమ్మ కూతురా!!
చింతపల్లి సంతలోన మంగమ్మ మన్మ డా
చింతకాయలు తెస్తావా మంగమ్మ మన్మడా !!
నీ చింత నాకంటే ఎల్లమ్మ కూతురా
నీకు చింతకాయలెందుకే ఎల్లమ్మ కూతురా !!
పోలేరమ్మ జాతరకు మంగమ్మ మన్మ డా
పట్టుచీర తెస్తావా మంగమ్మ మన్మడా !!
ముట్టుకుంటే కందిపోయే ఎల్లమ్మ కూతురా
నీకు పట్టుచీరలేందుకే ఎల్లమ్మ కూతురా !!
బూటకపు మాటలతో మంగమ్మ మన్మ డా
బుట్టలోన ఏస్తివి మంగమ్మ మన్మడా!!
నిజం జెప్తి నన్ను నమ్ము ఎల్లమ్మ కూతురా
నీతోడు నాతోడు ఎల్లమ్మ కూతురా !!