పున్నమి రేయి
పున్నమి రేయి
సంద్రము క్షీరసాగరమువలె కన్పట్టుచున్నది పున్నమి వెన్నెల్లో
సాగరతీరాన వెండికొండలవలె మెరయుచున్నవి ఇసుకతిన్నెలు వెన్నెల్లో
సాగరతీరము అలలకై ఎదురు చూచుచున్నది ప్రియుని ఆహ్వానించు పడతివోలె
అలలు ఉద్ధృతముగనున్నవి ప్రియసమాగమునకై ఉరకలేయు ప్రియునివోలె
ఇసుకతిన్నెలపైనున్న యువతి ప్రియునికై వేచిఉన్నది
చాతకపక్షి వలె
ఆమెకై వడివడిగ వచ్చు ప్రియుడు కన్పట్టుచున్నాడు
చకోరము వలె
తారాచంద్రుల వలె కనువిందు చేయుచున్నది వారి సమాగమము
గగనమున తారాచంద్రులవలె, వారు సైకత శ్రేణులయందు చేయుచున్నారు విహరణము
ప్రకృతికాంత రామణీయకతయంతయు అచట ప్రకాశించుచున్నది, రాకాచంద్రుని వలె
ఆ ప్రేయసీ ప్రియుల ప్రేమ యచట రాజిల్లుచున్నది
సామ్రాజ్యాధినేత వలె
నెలరాజు కరిమబ్బుల మాటున దాగెను , అందాలరాణి యవనిక చాటు మోము వలె
తన నెచ్చెలుడైన నెలరాజు కానరాక కోపగించిన సఖునివలె కెరటములు ఉవ్వెత్తున లేచె
చల్లగ మారిన ప్రకృతికి మబ్బుల నుండి వర్షము కురిసె, ప్రియుని వీడిన ప్రియురాలి కన్నీరువలె
ఝంఝా మారుతముతో మబ్బులు తొలగి నెలరాజు దర్శనమిచ్చె, యవనిక తొలగిన రాణివలె
ప్రకృతిలోని ఆకస్మిక మార్పులకు బెదరినది ప్రేయసి
భీత హరిణమువలె.
పొదవుకొని ఆమెను ప్రియుడు తన గుండెల్లో భయము తీర్చినాడు వీరునివలె
గాలికి చెదరిన మబ్బులు వడివడిగా ఇండ్లకు పోవు పిల్లలవలె సాగినవి
యథాస్థితికి వచ్చిన ప్రకృతిని కని వెన్నెలరేడు
పసిపిల్లవాని వలె వెన్నెల నవ్వులు కురిపించె
వెన్నెల చల్లదనం, ప్రియుని కౌగిలి వెచ్చదనం లోని హాయి ప్రేయసికి తోచె స్వర్గము వలె
అందమైన ప్రకృతిలో ఆనందాలనుభవించిన ఆ జంట
ఒకరికొకరుగా మమైకమైనారు ప్రకృతి పురుషులవలె