జలంధర్ ని నేను-కన్నీటి జలపాతాన
జలంధర్ ని నేను-కన్నీటి జలపాతాన


*జలంధర్ ని నేను-కన్నీటి జలపాతాన్ని నేను*
నీలాకాశపు మంచుమబ్బులా
ఎన్నాళ్ళకు కనిపించావు మిత్రమా
*దౌలాధర్*
దౌర్జన్యాల పగ్గాలతో ఎంత కాలుష్యాన్ని వెదజల్లాడీ మనిషి
అందుకేనేమో మౌనంగా ఆకాశం
కొంగుచాటున ధ్యానాన్ని ఆశ్రయించావు
పెరుగుట విరుగుటకొరకేనన్న మాట
మనిషే సృష్టించాడు కానీ
మరచిపోయాడు
విధ్వంసక మృదంగాన్ని మారుమోగించాడు
అడవులు కొల్లగొట్టాడు
వన్యప్రాణులను వేటాడి
నంగనాచిలా అభయారణ్యాలంటూ
అభయం ప్రకటించాడు
అంతరించిపోతున్న ప్రాణులు
ఊరికే ఉంటాయా
అరణ్యాలను ఆసరాచేసుకుంటేనేకదా
తాపసుల వాక్కులకు బలంచేకూరింది
అడవితల్లి ఆక్రోశమో
అడవిజంతువు రోదనో
ప్రకృతిమాతను కదిలించగా
పరిసరాలను పరికించిన
తల్ల
ినోట ఏ శాపం వెలువడిందో
కొరోనా జీవి ప్రాణం పోసుకుని
మనిషిని కట్టడిచేసే 'కొవిడ్' అ'స్త్రమయింది
వణికిన మనిషిప్పుడు గృహమే స్వర్గసీమంటున్నాడు
కుటుంబమే ఆలంబనంటూ
స్వీయనిర్బంధంలో
కొత్త విలువలను కళ్ళద్దాలుగా
చేసుకున్నాడు
తనస్వేచ్ఛను సమీక్షించుకుంటున్నాడు
క్షమించమని ఊరూవాడను వేడుకుంటున్నాడు
ఇప్పుడు నెమళ్ళు నిర్భయంగా నాట్యమాడుతున్నాయి
లేళ్ళుగంతులేస్తున్నాయి
తల్లీ దౌలాధారా
నాకంటి ధారాపాతాన్ని ఆపగలనా
నేను తల్లీ జలంధర్ నగరాన్ని
నీ మంచుకిరణాల వానలో తడుస్తున్న కన్నీటి జలపాతాన్ని
(దౌలాధర్ పర్వతశ్రేణిని కొరోనా లాక్ డౌన్ సందర్భంగా
తగ్గిన కాలుష్య స్థాయితో జలంధర్ ప్రజలు ఇటీవలే చూడగలిగారుట
ఆ స్ఫూర్తితో)
సి.యస్.రాంబాబు