ఇదికదా మనకథ
ఇదికదా మనకథ


పొట్టను చేత పట్టి పట్టా చేబుచ్చుకుని
పట్టాలెంటపడి పట్నానికి వలసపోయె.
బాధ్యత బుజమునెత్తి భవిష్యత్తు తలచుకుని
పరిశ్రమలెంటతిరిగి పాదరక్షలరిగిపోయె.
పోరాడు వీరుడా,పొద్దుపొడుచు సూర్యుడా.
పోటీ పెరుగుతున్న,కోటలోకి అడుగుపెట్టి
వలలో చిక్కుకున్న చేపల్లే జడిసినావు.
రేయిలేదు పగలులేదు,కంటినిండ కునుకులేదు
పైసా జమచేసి,చేసినావు ఉపవాసం.
పలువురి సావాసం,పలువిధాల ఉపశమనం
దొరికెను అవకాశం,చెరిపేందుకు నీ గమనం.
పెరిగే అనుభవమే,తరిగే నీలో భయమే
చాలని వేతనమే,చేజారే నీ కలలే.
కష్టం పక్కనెట్టి ఖర్చులనే పెంచుకోగ
అప్పులోల్లెంటపడి అమ్మయ్యలు గుర్తుకొచ్చె.
బంధం దూరమాయె,బంధువులే కానరారెే
కన్నీటి బిందువులే, కడుపున ఆహారమాయె.
తొందరపడకురా,కాలం మిగిలుందిరా
ఆలోచిస్తే,ఆ గగనమె సరిహద్దురా.
అలసట దరిచేరని పరుగే మొదలెట్టరా
కాచుకునుందిగా,విజయం నీముందర.
ఇట్లుఃమహేష్ కృష్ణ