మాతృతనూధనుర్విముక్తశరమే శిశువం
మాతృతనూధనుర్విముక్తశరమే శిశువం


మాతృతనూధనుర్విముక్తశరమే శిశువంటే!!
.................
పురుడుపోసుకుంటున్నతల్లి
పుడుతున్న బిడ్డతో
మనసుతో మౌనంగా
మాట్లాడుతోంది
కడదాకా
తోడైయుండేందుకు
తనకాయుష్షుంటుందన్న నమ్మకం లేక!
......,,,,,,,,,........
నిన్ను నమ్ముకో
నీ మంచితనాన్ని నమ్ముకో
మంచినీ మనస్సుకు ఇచ్చిన బలాన్ని నమ్ముకో..
నచ్చనివి జరుగుతున్నప్పుడు ఓర్చుకోవడంనేర్చుకో
నచ్చనివాటిని ధైర్యంగా ఎదుర్కోవటంనేర్చుకో
పని గంటల్ని అమ్ముకో
ఆస్తుల్ని అమ్ముకో
మనసుని అమ్ముకోకు
అభిమానాన్ని అమ్ముకోకు
సూచనలెన్నైనా విను
తెలివితో జల్లించి తగినవి పాటించు
అనుసరణలతో అణగారకు
నిన్ననుసరించే స్థాయికిచేరుకో
మేథావులమస్తకాలైన
పుస్తకాలను చదువుకో
ఇతరుల విమర్శల రాళ్ళకువ్వల్లోకూడా లోపాల్నితొలగించే రతనపురవ్వలుంటే ఏరుకో
ఓటమి లోనూ ఘనత
గెలుపులోన
ూ కలత
ఉండొచ్చు తెలుసుకో!
నవ్వుతూ బాధను భరించటంనేర్చుకో
సానుభూతితో
కన్నీరుకార్చటం నేర్చుకో
నీలోంచి అసూయ లేస్తే ఏమార్చటం నేర్చుకో
నీపై అసూయ బురదేస్తే
నవ్వుతూ కడిగేస్కో
సుతిమెత్తగా ఉండు అందరితో
చెడును చెడుతోనే జయించు
గెలుపుతో మరో గెలుపుకు బీజం వెయ్
ఓటమికి కారణాలంచనా వెయ్
సులభంగా లభించే కోట్లకన్నా
కష్టపడి సాధించే చిల్లరనోట్లే మిన్న
మంచిమిత్రులున్నట్లే
చెడ్డ శత్రువులూ ఉంటారక్కడే!
మంచీచెడూ రెండూ ఉంటాయ్
ప్రతిచోటా !!
నా వొల్లును
విల్లుగా చేసి
నా ప్రేమను నారిగా చేసి
నాప్రాణంలాంటి నిన్ను బాణంలాగా సంధించి
ఈ లోకంలోకి
వదిలేస్తున్నా......
లక్ష్యాన్ని సాధిస్తావని ఆశిస్తున్నా!
అమ్మగా నిన్ను ఆదేశిస్తున్నా!
లోకానికి ఆదర్శంగా నిలువుమా నా బుజ్జికన్నా!!
గాదిరాజు మధుసూదనరాజు