ఓ పుస్తకం
ఓ పుస్తకం


నీకు తెల్సింది రాయడానికి
తెలియనిది చదవడానికి
నీతో పాటే ఎప్పుడూ ఒక పుస్తకముంటుంది,
దాని పేరు.. "జీవితం"
పేజీల లెక్క వేరుగా ఉండొచ్చు కానీ
ప్రతి ఒక్కరి దగ్గరున్న పుస్తకంలో
ఒక్క పేజీ ఐనా ఖచ్చితంగా ఉంటుంది,
పుల్లు పడ్డ శరీరం కొన్నిట్లో
గాయాలైన గుండె కొన్నిట్లో
పగలు కాబడ్డ రాత్రులు కొన్నిట్లో
రాత్రుల్ల నుండి బయటకు రాని పగలు కొన్నిట్లో..
నవ్వినా ఏడ్చినా
ముద్రయ్యేది అవే అక్షరాలు
మిగిలేవి అవే అర్ధాలు,
పేజీలు నిండుతూనే ఉంటాయి
పుస్తకం ఖాళీ ఔతూనే ఉంటుంది..
కావున
నువ్వొక రచయితవి
రాస్తూనే ఉండు
పుస్తకం నిండిపోక ముందే
ఉన్న ప్రతి పేజీలోనూ
దొరికిన ప్రతి ఖాళీని పూరించు,
మొదట్లో తప్పులు దొర్లినా
తక్కిన పేజీలన్నిటిలో
అనుభవాలనెలా రాసుకోవాలో
గుణపాటలే నేర్పుతాయ్..
పుస్తకం రాయడం పూర్తయ్యాక
నువ్వు
నచ్చిన వాళ్ళ జీవితంలో ఒక కాగితం పడవగా
నచ్చని వాళ్ళ జీవితంలో ఒక చిత్తు కాగితంగా
మిగిలిపోతావ్...
"శ్రీ"