నీలో శూన్యం
నీలో శూన్యం
శూన్యం
#వాయుగుండ్లశశికళ
ముక్కు తుడుచుకుంటూ ఆతృతగా అన్నాన్ని నోటిలోకి తోసుకుంటున్న వేళ్ళని
అసహ్యంగా చూస్తావెందుకు!
ఎప్పుడైనా నీ ఆకలి రెండురోజులు ఎదురు చూసిందా !
మెతుకుని కూరని పిడికిలితో మెదిపి
తింటున్న విస్తారాకు ని విసుగ్గా చూస్తావెందుకు
కలిసినప్పుడు మార్చుకున్న అహపు రుచి నీకు తెలుసా !
నాలుక చివరతో నాట్యమాడుతున్న వేళ్ళమీద
పెరుగు రుచిని చీదరించుకుంటావు ఎందుకు!
అమ్మ గోరు ముద్దల రుచి మర్చిపోయావా!
నాగరికతను అన్నానికి అద్దుకొని
మునివేళ్ళతో తింటూ
ముద్దల పరుగులతో ఆకలి తీర్చుకుంటూ
ఎంత రుచిని
కోల్పోతున్నావో తెలుస్తుందా!
గడియారమే జీవితంగా పరుగులెత్తే
నిన్ను ఒక్క ప్రేమ రుచిగా నింపినపుడు
తెలుస్తుంది నీలోని జ్ఞాపకాల శూన్యత
అలాంటి వరమే నిన్ను వరిస్తే
అమ్మ దీవెనే అనుకోని నమస్కరించుకో!
లోపల అనుభూతి పొందకుండా పై పై పరుగులతో ఏమి పొందడానికి ఇక్కడకు వచ్చినట్లు.ఒక్క సూర్యోదయాన్నో,ఒక్క మల్లె పూవు సువాసననో ఆగి మనసులో నింపుకో.లోపలినిండుదనం బయటకు వెలుగు.