అమర సైనికుల ఆత్మ ఘోష
అమర సైనికుల ఆత్మ ఘోష


కళ్లెదురుగ కనిపించేది చాపలా పరిచిన హిమమైనా
మేమెల్లే దారుల్లో నిప్పురవ్వలే అడుగడుగునా
మా పయనం ఎముకలు కొరికే చలిలోనైనా
ఒళ్ళంతా చెమటలు పట్టే ఉష్ణం గుండెల్లోనా
చావంటే లెక్కేలేదు మాకది సానా సులకన
పేరేమి అక్కర్లేదు దేశం గెలిచిన సమయాన
వస్తే రానీ యుద్ధం వెన్నుచూపం ఉరకం
ఇంటికి జారిపోయి మూలన ముసుగెయ్యం
పోతేపోనీ ప్రాణం దేశం కోసం వేషం రోషం
కలిసిపోనీ దేహం మాతృ మట్టిన చిద్విలాశం
మా సావు రక్షిస్తుంది మన దేశాన్ని అనుకున్న నిమిషాన
మా రక్తం తిలకం చేసాం భారతమాత నుదిటిన
కానీ...
మేమింత చేస్తే
సర్వం ధారబోస్తే
మీలో కొందరు
దేశద్రోహులున్నారు
దేశాన్ని ఎదగనివ్వరు
త్రివర్ణపతాకం ఎగరనివ్వరు
లంచాన్ని అలవరిచెదరు
మోసాల్ని ప్రేమించెదరు
మన తల్లి ఒడిన చేరి
నటనలు ఆరితేరి
కళ్లు పీకెదరు
గొంతునులుమెదరు
గుండె కోసెదరు
వెన్నువిరుచెదరు
దేశాగత్యమును తిలకించెదరు
దేశార్థిక క్షీణతన పులకించెదరు
యుద్ధ సమయాన శయనించెదరు
దేశ పురోగతికి అడ్డునిలిచెదరు
అవి చూస్తూ చూస్తూ
మాతృభూమి శోకం తిలకిస్తూ
ఆత్మలైన మేము కన్నీరు కారుస్తూ
మా త్యాగాలకు ఫలితమేదని ఘోషిస్తున్నాం