నిరంతర బతుకు తపన
నిరంతర బతుకు తపన
చీమకైనా, దోమకైనా, పెద్ద ఏనుగుకైనా
గడ్డిపోచకైనా, తాటి చెట్టుకైనా
ఎత్తైన పర్వతానికైనా వీడదు బతుకు తపన
అన్నింటిపై ఆధిపత్యం చలాయించే
మనుషులకు మరీ మరీ ఎక్కువ
అదీ మామూలు బతుకు కాదు
కోరికల పావురాలు ప్రతిరోజు ఎగరేసే తపన
ఉన్న జీవితం నుంచి ఉన్నత జీవితం వైపు కోరిక
ఇవాల జీవితం బాగుంటే అలాగే ఉండాలనుకుంటాం
విసుగొస్తుంది నాలుగు రోజులకే
మరింత సౌకర్యంకోసం పరుపులపై కాళ్లు చాపుకుంటాం
మట్టి అన్నింటికి మూలమన్నది మరిచి
మట్టంటితే ఇన్ఫెక్షన్ అన్న వింత ధోరణి
సౌకర్యాలు పెరిగి పెరిగి
కదలిక మనిషికి బద్ధకమైతే సున్నితమైపోతుంది శరీరమంతా
అవయవాలపై పట్టు అప్పజెప్తాం డాక్టర్లకు
ఎప్పుడు ముగుస్తుందో తెలియని జీవితానికే
ఆశకు అంతుండదు, కోర్కెలకు కొదువుండదు
ఆకాశాన్నైనా మడిచి జేబులోపెట్టుకోవాలనుకుంటాం
భూమిపై పెత్తనానికి హద్దుల్లేని మోజు
అలాగని బతుకుతపన వీడొద్దు కానీ
మంచి వైపు మొగ్గుచూపితే బాగు
మార్పుల చక్రం గమ్మత్తుగా తిరుగుతుంటది
దేశవాళీ విత్తనం దిగుబడి తక్కువని హైబ్రిడ్ వైపు మొగ్గు
హైబ్రిడ్ లు ఆరోగ్యాన్ని హరిస్తున్నాయని
దేశవాళీల వైపు వెనుదిరిగిన చూపు
తెల్లన్నం మాని పాతకాలం మిల్లెట్స్ వైపు మళ్లింపు
శరీర కష్టం యంత్రాలకు అప్పజెప్పితే
కడుపులది అరుగదు తొందరగా
శ్రమను ప్రేమతో తలకెత్తుకోవడం మాని
డిస్క్రిప్షన్ లో భాగంగా చేయడం మారింది ఫ్యాషన్
ఉత్పత్తికి, అభివృద్ధికి ఉపయోగపడని కసరత్తది
బతుకుతపన ఉండాల్సిందే ఎవరికైనా
బతుకును కూలదోసేందుకు జరిగే ప్రతి కుట్రను
అడ్డుకోవాలి అనువైన ఏ రూపంలోనైనా
ఆత్మరక్షణకు చేతికి దొరికిన ప్రతిదీ ఆయుధమే
మట్టయితే క్రోధంతో ఉన్న కళ్ళల్లో చల్లు
మరేది లభించినా వాడుకో రక్షణకు
మనల్ని మనం కాపాడుకోవాలి మట్టంటకుండా
మనలాంటి వారిని కాపాడితే మరీ మంచిది
