రంగోలీ
రంగోలీ
రంగుపడే సంగతిలో..తేలినంత రంగోలీ..!
నిజపున్నమి వెన్నెలలో..తడిసినంత రంగోలీ..!
చెలి ఎవరో చెలుడెవరో..తెలుసుకున్న వారెవరో..
రసరాజ్యపు సరిహద్దులు..చెరిగినంత రంగోలీ..!
బాధంటూ లేనప్పుడు..నేర్చుకునే దేమిటంట..
చిరునవ్వుల తోటలాగ..వెలిగినంత రంగోలీ..!
ఎవరిక్కడ వుంటారో..కలకాలం యౌ'వనమున..
మనసన్నది కులాసాగ..మురిసినంత రంగోలీ..!
రంగులెన్ని పోసుకుని..రుద్దుకుని లాభమేమి..
లోలోపలి రంగుతెఱలు..కాలినంత రంగోలీ..!
పెదవి చివరి మాటలేల..ఉప్పొంగని రాతలేల..
చేతలన్ని చెలిమిమీర..పండినంత రంగోలీ..!
