చెమట చుక్కలు
చెమట చుక్కలు
సాయం చేసే గుణం లేకపోయినా
గాయం చేసే మాటలు వొద్దు
చింత నిప్పులాంటి కలహాలు సృష్టించి
తనువంతా ఎందుకు దహించి వేస్తారు..
ఈర్ష్య కుంపటి నెత్తిన మోసుకుంటూ
అసూయ తోలును నిలువెల్లా తొడిగి
ఎత్తిపొడుపు మాటల బాణాలను విసురుతూ
అవతలి వ్యక్తిని నాలుకలతో చీలుస్తారు..
కులాల వర్ణము పేరుతో రావణ కాష్టం
మతాల రంగులతో మారణ హోమం చేస్తారు
బక్క జీవికి బ్రతుకు నిచ్చే సాయం కావాలి
చెమట చుక్కల శ్రమకు ఖరీదు రావాలి..
ఆధిపత్య పోరులో అహంకార దర్పం
ధరాధిపులై శాసించాలనే గర్వం
కూలీల శ్రమలతో నింగిని తాకిన వైనం
సాటి మనిషికి అవిటితనం అంటగట్టిన దౌర్భాగ్యం..
చరిత్ర చెప్పిన నగ్న సత్యాలు
దొరికిన శిలా శాసనాల విజయగర్వం
సామాన్యుడి చేతిలోని జయ పతాకం
- ఎప్పుడు వర్ణించబడ్డాయి మహాకావ్యాలలో...
ఏ పల్లకిలో ఏ మోహంతో తిరిగిందో
ఏ శాస్త్రం ఎంత విజ్ఞతను చెప్పిందో
ఏ న్యాయం సామాన్యుడికి చేరిందో
బడుగు మనిషికి చదువెంత అబ్బిందో తెలుసా..
రథచక్రములు లాగినా మనిషి గుర్రాలను
రాజరికం మోసిన సామాన్య దివిటీలను
నేలను సస్యశ్యామలము చేసిన రైతన్నలను
వారి మనోవేదన గుర్తించిన మహోన్నతులెందరు..
ముళ్ళ కంపలపై బ్రతుకులు విసురుతూ
చినిగిన వస్త్రాలతో సింగారం చేస్తూ
ఉద్ధరించినామంటూ ఉపన్యాసాలు ఇస్తూ
బావిలో కప్పల మాద్రి అరుస్తున్న వితండవాదం..
చాలని మాటలో సౌందర్యం కావాలి
మానవత్వపు చెట్లను అందంగా పెంచాలి
సమాజ శ్రేయస్సు దిక్సూచిలా నిలబడి
వసుదైక కుటుంబానికి ఓనమాలు దిద్దుద్దాం..
