స్వచ్ఛమైన కవిత్వానికి
స్వచ్ఛమైన కవిత్వానికి
నావి అన్నీ వక్రపు రాతలే
తల్లి గర్భంలో చేతిలో ఏర్పడిన గీతల్లా
వాటికి జ్యోతిష్యం తోడై నిలిచింది
నా నొసటి గీతల భవితవ్యంగా మారిందా..?
కొందరికి అవి పిచ్చి రాతలు
మరి కొందరికి కవిత్వపు వాక్యాలు
నాకైతే అవి అసంపూర్తి వాక్యాలుగా
ఆలోచనలకు సృజనాత్మకత గాథలు..
వాక్యాలను నిలువునా కత్తిరిస్తూ
రాసిన గద్యాన్ని ముక్కలుగా విడదీస్తూ
ఎగుడు దిగుడు వాక్యాలను సరిచేస్తూ
రసవంతమైన వాక్యాన్ని సృష్టించాలని చూస్తా..
అయినా కవితకు ఏదైనా అర్హతే
కంటికి ఇంపైనా సాగుతుంది
చెవులకు విందైనా పంచుతుంది
కష్టనష్టాల ఉద్రేకాన్ని ముందు ఉంచుతుంది..
హృదయాన్ని తాకి అక్షరాలు పురివిప్పుతూ
కల్పితమో యథార్థమో అక్షర రూపం వచ్చి
ఒక భావాన్ని రూపకల్పన చేసి
కాగితము పైన కమనీయంగా సాగుతాయి..
మెదడు కుండలో అక్షరాన్నం తయారై
రుచి చూడమంటూ పాఠకులకు పంచుతాయి
జీడిపప్పులా అందులో పదాలు దొరికితే పరమాన్నం
అస్తవ్యస్తంగా తయారైతే విషాదం మిగులుతుంది...
ఏది ఏమైనా నా కలం సాగుతుంది
సమస్య ఏదైనా స్పందిస్తుంది
అక్షరాన్ని ప్రేమించుకుంటూ పోతున్నాను
స్వచ్ఛమైన కవిత్వం రాసేందుకు ప్రయత్నిస్తాను..
