సందేశం
సందేశం


చీకటిని లోతుగా చూస్తున్నాం
వెళుతురుకై ఆరాటపడుతున్నాం
గుండెల్లో ఘుర్మిల్లే కర్త
కనిపించని సందేశముతో దూత
జనన మరణ చక్ర భ్రమనమును పరీక్షించ
ఘనీభవించిన సమస్యతో స్వీకర్త
పీడితులు పాడితులు ప్రఖ్యాతి పండితులు
వాడనక వీడనక వీదంట విర్రవీగు వాడెవడైనా
చీకటిని లోతుగా చూస్తున్నాం
వెళుతురుకై ఆరాటపడుతున్నాం
బ్రతుకు వెతుకులాటలో అసలు జీవితాన్ని మర్చిపోతున్నాం
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలనుకునే కుతూహలంతో
అసలేది ఉన్నతమో మరేది ఉత్తమమో మరిచినాం
అలా కొంత కాలం పాటు నిదానించుదాం
ఇంటి మనసును, ఆప్యాయతల శ్వాసను
కాస్త ఆస్వాదించుదాం
చీకటిని లోతుగా చూస్తున్నాం
వెళుతురుకై ఆరాటపడుతున్నాం
భరించే భూమాతని సైతం బాధించేలా వికృత చేష్టలకు పూనితిమి గదా
ఫెళ ఫెళ ధ్వనులతో ఇపుడీ ప్రకృతి హెచ్చరిస్తోంది చూడు
అందమైన పక్షివలె ఎగరాలంటూ ఎగిరి ఎగిరా పక్షులనే భక్షించితిమి కదా
మృత్యుదేవత మరణ మృదంగం వాయిస్తోంది భువిపైనీనాడు
ఇపుడా మృత్యువు విలయతాండవం చేస్తుంటే
అయ్యో యముడికి జాలి లేదంటున్నామా
జోల పాటల్ని పాడిన కన్నతల్లినే జాలిచూపక గెంటే మనపై జాలేల
ఎక్కడో తయారైన ఫోనుని నొక్కుతూ
ఎవ్వడో చేసిన జంతుమాంసాన్ని ఆర్డర్ చేస్తాం
ఇపుడెక్కడో పుట్టిన జబ్బు మా వరకు వచ్చెన్
ఏమి మేము చేసిన తప్పని రోదిస్తామా?
కుల వర్ణ వర్గ జాతి మత వివక్షలు లేవని
బడుగు వర్గాలకు బడులు బోలెడని
తెలిసినా చెప్పని చెప్పనియ్యని
ఇరువది ఒకటవ శతాబ్ద ఆదివరకు దేశ లోతులకు చేరనియ్యని పల్లె పెద్దలు, క్రూర నాయకులు
ఈనాడు వద్దన్నా అందరికి చెబుతుంటిరే స్వాంతనష్టం చేకూరునని
ఈ వ్యాధి వస్తే వ్యాపించి పీడించి కీడించి పోవుదురే దళితుడైనా దనికుడైనా
ఆనాటి వర్ణ వివక్ష అను చీకటిని పారద్రోలుటకు నవయుగ కవిచక్రవర్తి సృష్టించెను గబ్బిలమునొకటి
శివుని చెవిన వేయ పంపించెను కబురునొకటి
ఈనాటి జాతి వివక్షతను గుర్తుచేయుటకు కర్త సృష్టించెనా కరోనా అను వ్యాధి ఒకటి
ఇచ్చెనా మానవుని మనుగడపై హెచ్చరిక ఒకటి
ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందగల ఇంగితమున్న మానవుడివి కదా
కాస్త సహనమును పాటించి ఇంటినే స్వర్గమందిరమని తలచు
కరోనాని దిగ్బంధించేంతవరకు నిన్ను నీవు నిర్బంధించ మేలని గమనించు
అది తగ్గిన మరుక్షణమే మరల మామూలే అన్నట్టుగాక మనిషిగా జీవించు