ఓ ఉ గాది మళ్ళీరా!
ఓ ఉ గాది మళ్ళీరా!


ఓ ఉగాది మళ్లీ రా!ఇంటిచెట్టు మనిషిపూలతో నిండుగా ఊగుతూ ఉంది.
పరుగులు పెట్టె గ్రహాలన్నీ భయాన్ని
కప్పుకొని మౌనంగా ఇంట్లోకి చేరిపోయాయి.
భయం కప్పిన ముసుగును ఛేదించుకుంటూ కొంచెం ప్రేమను పంచుకుంటూ ఉన్నాయి.//
క్రికెట్ స్కోర్ లనుఁ తలపించే మరణాల
స్కోర్ లు టి.వి లో గ్రాఫ్ ను పెంచేస్తూ
ఉన్నాయి.
చైనా,ఇటలీ,అమెరికా,స్పెయిన్,
పెరు ఏదైతేనేమి అక్కడ వినిపించేది
మృత్యుగీతాలే!
హాస్పిటల్స్ గోడలు బాధితుల మూలుగులు
తో,నెలల నిండిన తల్లుల గుండె చప్పుళ్లతో బరువెక్కాయి..పుట్టుక, చావు రెండు కాళ్లుగా కాలం పరిగెడుతూ ఉంది.//
పరుగులు తీస్తూ వస్తున్న వైరస్ బాణానికి
భారతదేశం లాక్ డౌన్ కవచాన్ని
ధరించింది.
నీ ఒక్కడిదేనా కష్టం?
అటు చూడు చాయ్ దుకాణాలు మూగపోయాయి.చిన్న వ్యాపారాలు ఆగిపోయాయి.లోపలి ఆకలికేకలను ముడుచుకున్న మోకాళ్ళు వింటూ ఉన్నాయి.
కూరగాయలు అమ్మే ముసలమ్మ,
మూటలు మూసే కూలీలా,లక్షలు
సంపాదించే వాళ్ళ వరకు ఒకటే భయం.//
పైనబడి చంపే పులి కాదు కరోనచాప క్రింద చేరి చంపే విషం!
ఇప్పుడు మనమే కాదు,అందరూ బాగుండాలి.
క్షణ క్షణం వచ్చే వారాలు,144 సెక్షన్ లు,
ఆగిపోయిన విమానాలు,రైళ్లు,బస్ లు.
పొట్ట పట్టుకొని పరాయి ఊరికి పోయిన పిల్లలు అక్కడ,ఒంటరిగా కుమిలి తల్లి తండ్రులు ఇక్కడ.వైరస్ తుఫాన్ లో చిక్కుకుని పోయిన పిట్టలు అందరూ!
అందరి తపన ఒకటే తనవారిని
చేరుకొని మరణాన్ని ఎదిరించాలి అని.//
ఎవరి చేయి తగిలితే మృత్యు కరచాలనం అవుతుందో తెలీని ముప్పుల మధ్య
నమస్కారం చేస్తూ వచ్చింది ఉ గాది, సంతలో అమ్మ నుండి తప్పిపోయిన పిల్లాడిలా ఉంది.
పంచె కట్టుకున్న నాన్న,
పట్టుచీర తో అమ్మ,
పై పై నవ్వులతో పిల్లలు,
పచ్చడిలోకి చేదు,
గుమ్మలకి తోరణాలు లేవు.అన్ని గుమ్మాలకు వ్రేలాడుతూ ఉన్నది చావు భయం ఒక్కటే.
ఉగాదిని వద్దు పొమ్మనలేక,
మనస్ఫూర్తిగా రమ్మనలేక
కళ్ళను టి.వి తెరకు అంటించి
బ్రతుకుభయం తో బితుకు బితుకు మంటూ ఉన్నారు అందరూ//
ఏమయ్యింది మిత్రమా?అనునయంగా
అంది ఉగాది.
శుభాశుభాల మిశ్రమమే కదా జీవితం.
కలరా,ప్లేగు,స్వైన్ ఫ్లూ,ఎయిడ్స్....
వైరస్ ల అడ్డుగోడలు ఎన్ని దాటలేదు మానవజాతి!
అవగాహన పెంచుకొని భయాన్ని త్రుంచుకో.
వైరస్ వాహకంగా మారక ఇంటి నీడలో ఉండు.
కరచాలనాలు,ఆలింగనాలూ నిన్ను ఇప్పుడు కబళించే కందకాలు.
పూరేకుల మధ్య దూరాన్ని మనుషుల
మధ్య పాటించు.
కనపడని యుద్ధం లో నీ సహనమే కవచం.
శుభ్రత,సోషల్ డిస్టన్స్ నీ ఆయుధాలు!//
అటు చూడు ....
సూర్య చంద్రుల్లాగా డాక్టర్ లు,పోలీస్ లు నీకు కాపలా కాస్తున్నారు.
కార్మికుల కష్టం నీకు ఇప్పుడు కోట గోడ.
శుభ్రతను పాటిస్తూ ఇంట్లో ఉంటే
దేశం కోసం పోరాడే వీరుడివి నీవే!
బందీగా అనుకోక భాద్యతలు పంచుకో.
నేటి చేదు రేపటి తీపి ఫలితం అవుతుంది.
బలపడింది బంధాలు నీకు భవిష్యత్తు
విజయాలు ఇస్తాయి.//
ఓదార్పు చినుకులకు ధైర్యపు మొలకలు
తొంగి చూసాయి.
ఆవిరైన భయం మధ్య సూర్యుని వెలుగు.
విచ్చుకున్న మొహాలు ఒకటే చెప్పాయి...
ఓ ఉగాది మళ్లీ రా.
క్వారెంటైన్ ను కత్తి చేసుకున్న మానవుల ఐక్యత ఇచ్చిన విజయాన్ని
చరిత్రలో పుటగా లిఖించి పోవడానికి!