కన్నయ్య ఇలా చేయవచ్చునా!
కన్నయ్య ఇలా చేయవచ్చునా!
కన్నయ్యా ఇలా చేయవచ్చునా!
.....#వాయుగుండ్లశశికళ
ఎన్ని చూస్తాయో నా కళ్ళు!
మఙ్గిగ కవ్వాల నృత్యాలు,
తెల్లని ముగ్గుల మెలికలు,
ఉడుకుతున్న మెతుకుల్ని
కూర రుచితో కలుపుతూనే ఉంటాయి.
వెన్నకుండ పక్కన పోయే
చీమల వరుస కూడా
ఇదిగో కంటి పాపలపై నడిచిపోతూనే ఉంటుంది.
చిత్రం నా కంటిపాపల పర్వతాన్ని ,
ఏ మబ్బు చేతితో మూసేస్తావో,
కుడి ఎడమల అంతరమే
తెలియడమే లేదే!
పర పురుషుడు కనపడగానే,
తలుపు వెనుక నిలిచే బదులు
పైటను సర్దే రెండు చేతులు,
నీ ఉనికి తెలియగానే మైమరుస్తాయే!
బుద్ధి విత్తనాన్ని జ్ఞానపు మన్నులో ముంచుతావేమో,
స్త్రీ,పురుష అంతరమే లేదే!
నువ్వే సత్యంగా తెలియడానికి,
సత్యంగా నువ్వే అవ్వడానికి ఎంత తేడా!
నా మనసును ఏ కళ్లెంతో నీతో కట్టేస్తావో కానీ,
నువ్వు ,నేను
మధ్యలో ఎన్ని గీతాలు గీసినా
కాలపు నదిలో కొట్టుకుని వెళ్లిపోతున్నాయి.
వెతికితే దొరకని పరమార్ధం,
పిలిచి మరీ ఇచ్చి వెళుతావు,
ఇప్పుడిక ఇహానికి ,పరానికి
తేడాయే లేదే!
@@@@@