పల్లె మూల్గుతోంది..
పల్లె మూల్గుతోంది..
సూరీడింకా లేవకముందే..
తొలికోడిoకా కూయకముందే..
తామర పూలు విచ్చుకోక ముందే..
అదిగో..
నిండు చూలింత లాగా ..భారంగా..
కిర్రుమంటూ ఆగిందోక పట్నం బస్సు.
ఆశల మోసుల తాదాత్మ్యం..
పుట్టినూరి మట్టికై కొట్టుకునే ఓ హృదయం..
పండుగ కళ కై ఉత్సాహం..
పల్లె అందాల పై వాత్సల్యం..
జాగ్రత్తగా పెట్టెల నిండా సర్దుకుని
ఒకరి వెనుక ఒకరుగా..
త్వర త్వరగా..అలసటగా..
మా పల్లెకు అతిధులుగా
పట్నపు గుండెల చప్పుళ్ళు.
వాకిట వేసిన ముగ్గుల్లో
చిటపట వెలిగే చలిమంటలలో
మామిడాకుల తోరణాలలో
పట్టుపావడా , పారాణి లో..
పల్లె సంస్కృతి తడిమి చూసుకుని
మురిసిపోయే
మహరాజులు వాళ్ళు..
మూణ్నాళ్ల ముచ్చటకై
కొలువుదీరిన బొమ్మలు వాళ్ళు.
అరిసెల కురపాం కడగనే లేదు..
మామిడాకుల కళ వాడనే లేదు..
తల్లిదండ్రుల
కళ్ళు
తమనింకా తడిమి చూడనే లేదు..
ఇంతలోనే .
అలకల కిరికిరి అల్లుళ్ళు,
ఇకచాలంటూ కోడళ్ళూ,
బై బై అంటూ మనవళ్లు..
తిరుగు ప్రయాణానికి సర్దుళ్లు.
కోడిపందాలు..
భోగి మంటలు,
రంగవల్లులు,
మినపగారెలు, నాటుకోళ్లు..
ఇన్ని చూసిన మీకళ్ళు
ఆ మనుషుల ప్రేమను తడిమేనా ..
పండుగ రోజుల సందళ్ళు
ఆ పల్లె కన్నీరు తుడిచేనా..
సున్నం వేసిన గోడల వెనుక,
రంగవల్లుల వాకిటి వెనుక,
పిండివంటల ఘుమఘుమ వెనుక,
పండుగ పంచే నవ్వుల వెనుక..
మీకు తెలియని ఒక నిట్టూర్పు ఉంది
ఏడాదికి సరిపడా ఎదురు చూపు ఉంది.
ఇంతలోనే మీరు వెళ్లిపోతారనే బెంగ ఉంది
మళ్ళీ మీరొచ్చేదాకా
ఈ కళ ఇలాగే నిలుపుకోగలమా
అనే ఆందోళన ఉంది..
ఇన్ని భావాల పెనుగులాట లో
పల్లె మూల్గుతోంది..
నా పల్లె చిన్నబోతోంది.