ఓ మగువా!
ఓ మగువా!


ఝాన్సీ రాణిలా
విదేశీయులపై తిరుగుబాటు
చేయక్కరలేదు
రాణీ రుద్రమదేవిలా
దేశ ద్రోహులపై యుద్ధం చేయక్కరలేదు
దుర్గభాయ్ దేశ్ ముఖ్ లా
స్వతంత్ర పోరాటంలో
ప్రాణత్యాగం చేయక్కరలేదు
ఎందరో వీర నారీమణులు
మరెందరో వీర మాతలు
అశువులు బాసిన ... భరత గడ్డపై
అబలలుగా కాదు
సబలలై సాగండి...
అలంకరణలో కాదు
ఆత్మరక్షణలో మెళకువలు
నేర్చుకోండి...
ఆత్మవిశ్వాసం కోల్పోని
ఆలంబనగా నిలవండి....
ఆడపిల్లవనే జాలి చూపులకు
కరిగిపోకు....
ఆరని నిప్పు కణికలా
కనక దుర్గ అంశగా....
నిన్ను నువ్వు మార్చుకో...
ఓ మగువా.... మృగమదగజాల
మదమణిచే.... మణి కర్ణికవై
మేలుకో....!
త్రేతాయుగాన రావణుడొక్కడినే
సంహరించారు
ద్వాపరమును కీచకుడ్ని మట్టుబెట్టారు
నేడు అడుగడుగునా దుర్యోదన దుశ్శాసనులే
తెగబడుతుంటే
కల్కివై కత్తిని సంధించు
కలుగులోని త్రాచులను తుదముట్టించు
పెట్రోలు వాసనతో
నిండిన హృదయాలెన్నో
దగ్దమై భగ్గున మండుతోంది
మృగాళ్ళ వేటలో లేడివై పోకు
ప్రచండ సింహమై గర్జించు
దిల్లీ నుంచి గల్లిదాకా
దగాపడినా నిర్భయలెందరి
కన్నీరు సముద్రాలై ఉప్పొంగుతుంటే
నీ అసమర్థతే నీ ఆయువు
హరిస్తుందని తెలుసుకో
అమ్మ కళ్ళలోని ప్రేమనే చూడలేని
కామాంధులు కాచుకుని వుంటారు
అక్క చెల్లెళ్ళ వరుసుల ఊసులైనా
తలవని ఉన్మాదులుంటారు
మిమ్మల్ని మీరే కాపాడుకునే
అస్త్రమై పదును పెట్టుకో
శస్త్రమై సంధించుకో...
నిర్భయగా తలదించక
కన్నీటి దిశలో కరిగి పోక
కణకణమండే జ్వాలలా రగిలిపోవాలి
అత్యాచారమనే పదమే
వినబడక వణుకు కలిగించాలి
ఓ మగువా...మృగమదగజ
మదమణిచే మణికర్ణికవై
మేలుకో...
మేలుకో....!