మాట..!
మాట..!
*మాట*
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
గులాబి ముళ్ళేవో
గుండె గూటిని పదే పదే గుచ్చేస్తూ
గాయాల మాటల మూటను
గుట్టుగా ఓ మూల నుండి
విసిరేస్తున్నా..
ఓ తియ్యని స్వాప్నికమేదైనా
వెన్న ముద్దలా పెదాలకంటించుకుని
పెరగిన వయసుకే కాదు
మనసుకు ఓ మెత్తని మాటను
పంపమని చెప్పాలి...
చెలిమితో దోబూచులాడే
చంచల చతురుల..
మర్మపు మాటల లొసుగులతో
మనలోకి చొరబడే యత్నం చేస్తుంటే.
వారింపు మాటలను వాకిట తోసి
రంగవల్లికలవ్వా
లి...
నిర్లిప్తతల మధ్య నలిగిపోతున్న
మనసుకు ఊరడింపునిస్తూ
ఆత్మస్థైర్యపు ఆయుధపు పగ్గాల
మాటలతో చైతన్యపు చిరునవ్వు నివ్వాలి...
గెలుపు బాటలో పయనిస్తూ
అహం నిచ్చెనలో ఎగబాకుతుంటే
అంతరంగాన్ని ఆత్మవిమర్శ చేసే
అలౌకిక మాటను అవలోకించాలి...
ధైర్యపు నూలుపోగులో
నుశిలా మారక
పది మంది మేలుకోరే
నీ మాట మకరందమవ్వాలి. . ... !
*వై.కె.సంధ్యశర్మ*
.