మహిళా వందనం!
మహిళా వందనం!
మహిళా వందనం!
మహిళా ఓ మహిళా వందనం
సహనానికే నువు నందనం
కార్యక్షేత్రంలో పనిమంతురాలిగా
నీ మనోసంకల్పం ముందు
యాంత్రికత తెల్లబోవాల్సిందే
ఓ మహత్తర సూర్యగోళంలా
అన్నీ తన చుట్టూ తిరగాల్సిందే..
అశక్త ఒక ఊహ మాత్రమే
ఆటంకాల కోటల్ని ఫిరంగులతో
పేల్చేయాల్సిందే...
లోపం ఒక నెపం మాత్రమే
కనిపించని మనసు వరదై నదినే
ముంచెత్తదా...
దిక్కు దిక్కునా తనే
ఆత్మవిశ్వాసం గుప్పిట పట్టి
అంతర్జాతీయ వేదిక మీదా
ఒడిసి పట్టుకోలేని పన్నీటి జల్లులా తనే...
సృష్టికి ప్రతిరూపం
నాల్గువేదాల సారం
ఆర్థిక సూత్రాల బీజం
అద్వైత సిద్ధాంతం తనే...తానే
అత్యాచార నరమేధానికి
వరకట్న దురాచారానికి
తల్లడిల్లే తల్లి తనే...
మనసుని ఉలిలా తీర్చిదిద్దే
నిప్పుల కొలిమి...
సునిశితమైన జీవ వైవిధ్యం
తరాల అంతరాల్లో నిక్షిపైమైనా
ప్రశాంతమైన దృక్కులతో
విధికి ఎదురీదే నావ తనే
మార్గదర్శిలా దారి చూపినా
ముళ్ళ పొదలనే పొదివి పట్టినా
ముదితల్ నేర్వని విద్యగలదాయని
ఆకాశానికెత్తినా....
తరతరాలుగా తీరని బాధలెన్నో
చెరిగిన నవ్వులెన్నో
వీర వనితలై ధీరత్వం నిలిపినా
జగతిలోన జఢముగా చూసేటి చూపులెన్నో
అణువుణువు నిండిన నీ చరిత
ఆకాశం తాకిన నీ ఘనత
ఏ పదములు చాలవు నిను కొలువా
మహిళా ఓ మహిళా వందనం
సహనానికే నువు నందనం!