Srivatsa Alluru

Inspirational

4.9  

Srivatsa Alluru

Inspirational

మహిళా సాధికారత

మహిళా సాధికారత

1 min
4.2K


ఆ పై వాడికి కనికరమే లేదు కాబోలు ...


మహిళల కళ్ళల్లో నింపాడు కన్నీళ్ళ కడలి ,


ఏ నాడు చేశారో మహిళలు పాపాలు ,


కలవే కర్ణుడిని మించిన శాపాలు ...


లేకున్నా వారిలో ఏ లోపాలు ,


వారి పైనే మగసిరి కోపాలు, తాపాలు ...


ఆడవారే ప్రతీ ఇంటికి మణిదీపాలు ,


కానీ, పడతారు వారే కష్టాలపాలు ...!!!


                *****



 ' ఆడది '  కడుపున ఉన్నదని తెలిస్తే చాలు...


 పుట్టక మునుపే మొదలౌను పోరు ...


 పెదవిప్పకుండా ఆ తల్లి నోరు ,


బంధాలతో, బెదిరింపులతో కట్టేస్తారు ...


బలవంతంగానైనా సరే గర్భం తీసేస్తారు ...


ఖర్మ కాలి పుడితే అసలూరుకోరు ...


చెత్తకుప్పకే దత్తతిస్తారు ...!!!


                *****


అత్యాచారం .. ఇదేమి ఆచారం ?


హత్యను మించిన అపచారం ...


మహిళల పాలిట గ్రహచారం ...


నాడు నిర్భయ ,

......................... నేడు ఎందరో నిర్భాగ్యులు ,



చిక్క లేదా కీచకుల చెరలో ,


నయవంచకుల వలలో ...!


మహిళలకు రక్షణ లేదు ,


పురుషులకు మానవత్వ శిక్షణ లేదు..


పడతుల వలువలేవయితే నేమి ?


పురుషుల విలువలేమయినాయి ?!!


ఆడదంటే ఎందుకంత చిన్నచూపు .. ?


శక్తి లేనిదనా ??

......................... ఆ ఆది శక్తీ ఆడదేగా ...!


ఆమె అంశ వీరిలో దాగిలేదా ??


               *******


పసుపుతాడు పేరుతో


పలుపు తాడు మెడనేస్తే ...


జీతం లేని పనిమనిషి గా


జీవితమే ధారపోస్తుంది ...   మహిళ  !!!


వరకట్నం కోసం వేదించినా ,


వ్రతాలతో మొగుడి ఆయువు పెంచేది ...  మహిళ !!!


వెట్టి చాకిరి చేయించినా ,


వంటింటి కుందేలుని చేసినా...


బడి చదువులు వద్దన్నా ,


ఒడిదుడుకులను ఎదుర్కొను మానసిక స్థైర్యాన్ని కలది ...  మహిళ !!!


ఉసురు ఊది ఊపిరి పోసిన అమ్మైనా ...  మహిళే !!


తోడుండి , ఆడిపాడిన తోబుట్టువైనా ... మహిళే !!


నడకా , నడవడి నేర్పిన బామ్మైనా ... మహిళే !!


చెలిమి చేసిన స్నేహితురాలైనా ... మహిళే !!


ప్రేమానురాగాలు పంచిన ఇల్లాలైనా ... మహిళే !!


ఆమ్మైనా , చిన్నమ్మైనా , అమ్మమ్మైనా , అత్తమ్మైనా ... మహిళే !!!


ఆ మహిళే లేని నాడు మగాడికి దిక్కేదీ ??


ఇంక ఏ దేవుడికీ వాడు మొక్కేదీ ??!!!


              *******


స్త్రీల ఖేదం మోదమవ్వాలంటే ...


     --> అరాచకత్వం అరికట్టాలి ,


     --> పురుషాధిక్యత అంతరించాలి ,


     --> ఆగంతుకుల ఆగడాలు అటకాయించాలి ...


అప్పుడు నిజంగా ...


      ✓  ఆనందం అర్ణవమౌతుంది ,


      ✓ అనురాగం అంబరమౌతుంది ,


     ✓  స్త్రీ జాతి ముందుకెళ్తుంది ,


      ✓  సమానత్వానికి దారి తీస్తుంది ...!!!


ఆరోజే పడతులకు పర్వదినం ...


విశ్వ మానవ జాతికి పునర్జననం ... !!!


             *******


 8 మార్చి, 2020


అంతర్జాతీయ మహిళా దినోత్సవ శభాకాంక్షలు ...!!!!  


         




Rate this content
Log in

Similar telugu poem from Inspirational