ముద్దు బిడ్డ
ముద్దు బిడ్డ


చీకటి చిక్కబడి
వెన్నెల వెచ్చబడి
తనువు నీ తపనలతో తల్లడిల్లిపోతుంది..
తల్లి చాటు బిడ్డవు కదూ!
ఆలి నీకలుసు..
ఎక్కడో అమ్మ ఎదపై తుపాకీతో పహారా ఆట ఆడతావు
నీ నేస్తాలతో కూడి గస్తీ కాస్తావు...
దట్టమైన అడవిలో
గడ్డకట్టే చలిలో
నడిసంద్రంలో
వినీలాకాశంలో
చుట్టూ తిరుగుతావ్ అమ్మ కొంగు వదలక...
అనుక్షణం అప్రమత్తంగా పోరాడతావ్
రొమ్మెత్తి ఎదురు నిలుస్తావు
నేను గుర్తున్నానా? అని అడిగితే..!
నిన్ను ప్రేమిస్తున్నాను,
నీతోనే ఉంటాను
అని అబద్ధం ఆడమంటావా? అంటూ
చుక్కలతో చమత్కరిస్తావు...
ఎంత అశో!
అమ్మ చేత ముద్దుబిడ్డ అనిపించుకుందామని..
మరి నేనేంగాను..?
చీకటి చిక్కబడి
వెన్నెల చల్లబడి
నా ఊపిరి ఉలికి పాటుల సవ్వడిలో
నీ ముద్దు బిడ్డ ఎదపై జోగుతోంది...
నీ తలపులతో
సగం గుండె బరువెక్కిపోతుంది..
ఎంత హుషారో
ఏమంత పట్టుదలో
ఎందుకంత కార్యదక్షతో
నాలో నింపిన నీ మొండిధైర్యం
ప్రపంచంతో పనిలేదన్నట్టు
పాదాల్ని పరిగెట్టిస్తోంది..
నిలువని మేఘంలా వస్తావు..
నా తల్లి సపర్యలకి వీరుణ్ణీయమని మురిపిస్తావ్ మైమరిపిస్తావు..
ఎంత స్వార్థం? అంటే బుగ్గని గిల్లి,
అమ్మ పిలిచిందంటూ
రణధీరుడవై యుద్ధరంగానికి కదం తొక్కుతావ్..
చీకటి చిక్కబడి
వెన్నెల రుధిరజ్వాలు చిమ్ముతోంది..
నా తనువు మనసు కఠినమై, జఠిలమై
కనుపాప చేరని గుండె తడి
సందిగ్ధ, సంకట, ప్రశ్న రూపు దాల్చినది
ఇప్పుడు నేనేమని వేడాలి..?
నా ప్రాణమా! సౌభాగ్యమా!
నే వేడుకుంటున్నా
అమ్మ నుదుట నిలువు రక్త సింధూరమై
భరతమాత సౌభాగ్యమై!!