ప్రేమలేఖ
ప్రేమలేఖ


ప్రియమైన నా సగ ప్రాణానికి,
ఏంటి లేఖ అనుకుంటున్నావా? ఇది లేఖ కాదు ప్రేమలేఖ అంటే, నవ్వుతావా! ఈ లేఖ ఆసాంతం చదువు నీకే అర్థమవుతుంది.
అసలు ఈ మధ్యమాలని అనాలి! ప్రేమ అనే పదానికి పేటెంట్ రైట్స్ యువకులకి అప్పజెప్పినందుకు.
మనకి తెలియదా ప్రేమంటే!
నీ మునివేళ్ల పరిచయానికి తెలియదా?
మన ముద్దు మురిపాల కు తెలియదా ?
తన ఉనికినే పట్టించుకోలేదని అలిగిన వెన్నెలకు తెలియదా ?
నలిగిన మల్లెలకు తెలియదా?
ఊపిరి ఆడటం లేదని మనల్ని వెలివేసిన ఆ గాలికి తెలియదా?
మనం వశమై పరవశించిన రతీమన్మధులకు తెలియదా?
నీ బాధకి నా కంట ఉబికే కన్నీటికి తెలియదా?
అల్లంతదూరాన నీ అడుగుల సవ్వడికే
సందడి పడే నా గుండెకి తెలియదా?
నీ మౌనాన్ని వినే నా కళ్ళకు తెలియదా?
సంధ్య వేళ నీ చూపు సోకి సిగ్గుల మొగ్గలయ్యే నాబుగ్గలకి తెలియదా?
నీ చిరుస్పర్శకే సయ్యాటలాడే నా తనువుకు తెలియదా?
వీడక నీ కోసం నీ ఆలోచనలతో రమించే నా మనసుకు తెలియదా?
నీకోసం ఎదురు చూసే విరహానికి తెలియదా?
బరువైన బాధ్యతను పంచుకొని సులువుగా మలచుకునే మన బంధానికి తెలియదా?
నా భావోద్వేగాల ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కట్టడిచేసే నీ అదుపాజ్ఞలకి తెలియదా?
నా మౌనానికే తాళలేక కాళ్ల బేరానికి వచ్చే నీకు తెలియదా?
నా ఊహల గుసగుసలని లయబద్దం చేసే నీ ఊపిరికి తెలియదా?
మరణం కూడా విడదీయలేని మన మధ్య ఉన్న ఆకర్షణకు తెలియదా?
పదే పదే మేము ప్రేమించుకుంటున్నాం అంటే గాని ప్రేమ కాదు కాబోలు
ప్రతిక్షణం ఆనందంగా జీవిస్తున్న మనలో లేదా ?
అందంగా నడుపుతున్న మన సంసారంలో లేదా?
ముచ్చటగా ఎదుగుతున్న మన చిన్నారిపాపల్లో లేదా ?
మన వంతు చేసే సమాజహితం లో లేదా?
దేనిలో లేదు ప్రేమ?
నాకు నువ్వు నీకు నేను అని అనుకునే మనకి కాక!!
నీకు నువ్వే నాకు నేనే , నాకోసం నేనే అని అనుకునే వీళ్ళకా తెలుసు ప్రేమంటే ?
నీ సగప్రాణం నా సగప్రాణం కలిస్తేనేగా ఈ ప్రేమ జనించిందేమొ?
నీ సగప్రాణం