నేను ఆడపిల్లను
నేను ఆడపిల్లను


అవును..
నేనొక ఆడపిల్లను.
అన్ని జీవుల సంతానంలాగే నేనూ
అమ్మబొజ్జ లో పెరిగాను.
ప్రకృతిఎంపికలో ఏ లోటు లేకుండా
ఆరోగ్యవంతమైన శిశువుగా
.అంగీకరించబడ్డాను
కానీ ఇదేమిటి..?!
ఈ సమాజపు ఎన్నికలో
ఇలా
తిరస్కరింపబడుతున్నాను..
నిర్దయగా నెట్టివేయబడుతున్నాను.
జీవధార కొనసాగింపుకు
ఆధారం ఆడపిల్ల..
జీవన మాధుర్యానికి
ఆలవాలం ఆడపిల్ల.
అయినా..
పుట్టిన మరుక్షణం నుంచి..
ఆ నిట్టూర్పు సెగలే
ఆడ పిల్లల పాలి జోలపాటలు..
నిష్ఠురపు ఎత్తిపొడుపులే
ఊయల ఊపుల ఊత పదాలు.
తెలిసీతెలియని చిరుప్రాయంలో
ఈ రంగుల భేదం కనపడకున్నా..
బడిలో చేరే తొలి అడుగులలో
ఆ ఎత్తుపల్లాలు అవగతమౌతాయి
మరి సరి అడుగులు తడబడతాయి..
ఇక్కడ దించిన తల అక్కడ ఎత్తు..
అక్కడ దించిన తల ఇక్కడ ఎత్తు.
ఇదే కదా ప్రతి తల్లీ తండ్రి చెప్పే షోడశాక్షరి.
కన్నెత్తి చూడకపోతే
ఎలా తెలుస్తుంది ..?
కాపలా కపాలమేదో..
కాటేసే క్రూర మృగమేదో..!
కాఠిన్యం నేర్వక పోతే
ఎలా తెలుపుతుంది..?
ఈ కరవాలం ఎంత పదునైనదో!!
మెట్టుమెట్టు గా
అతి పదిలంగా అందలమెక్కే
అతిప్రయాసలో..
ఆడపిల్లగా పుట్టినందుకు
ఒక్క చేయీ ఊతమివ్వదు..
ఏ ఒక్క హృదయము ఆలంబన అవ్వదు.
కన్న వారి కలల లో సైతం
ఆడపిల్లగా నా ఉన్నతి
నా భర్త ఉదారంగా నా పై కురిపించే
ప్రేమామృత బిందువులే..
నా బిడ్డలను తీర్చిదిద్దడం లో
నే చిందించే స్వేదబిందువులే.
మరి
నా లక్ష్యం సంగతి?!
నా గమ్యందేగతి?!
నా జీవిత పుస్తకంలో
మొదటి పుటల్లో నే గీసుకున్న బొమ్మలకు
రంగులెవరు అద్దుతారు?!
నా ఆశల సౌధాలకు
మెట్లదారి ఎవరేస్తారు!?
రంగులు , కుంచెలు సరిచూసుకుని
సరిగా అద్దేలోగా..
దాష్టీకం చేసే ఆసురుల హస్తాలను
ఎవరు మొదలంటా నరికేస్తారు.
అవును ..
నేను ఆడపిల్లను.
అందుకే ఆఖరి ఊపిరి దాకా
నా గమ్యం చేరే మార్గం మరువను..
నా గమనం లో అవరోధాలెన్నైనా
అడుగులు తడబడనివ్వను.
ఆడపిల్లగా నా ఉనికి
కుటుంబంలో నవ్వులు పూయించాలి
సమాజ ఆదర్శాల కి
నేనొక చిరునామా గా నిలవాలి.