నాదేశం - నా జెండా
నాదేశం - నా జెండా


కవితాంశము: నాదేశం – నా జెండా
కవిత శీర్షిక: కీర్తి శిఖరం
తెల్లదొరలపై పోరాటంలో
జాతినేకం చేసిన అజేయ శక్తి
కుల మతాలకు అతీతంగా
పసిమొగ్గ నుండి పండుటాకు వరకూ
పూరి గుడిసె, ఘన భవంతుల
తేడా కానరాని
జాతీయ పతాక రెపరెపలు
భరత జాతి గుండె చప్పుడై
ఉద్యమానికి ఊపిరిపోసి
ఆంగ్లేయుల భరతం పట్టిన
వీరుల చేతి వజ్రాయుధం
పింగళి వెంకయ్య తలపులకు ప్రతిరూపమై
ముచ్చటైన అమరికతో
ధర్మ ప్రవర్తనకు గరిమనాభిగా ధర్మచక్రముతో
మురిసి మెరిసిన మువ్వన్నెల పతాకం
కాషాయపు వర్ణం త్యాగానికి ప్రతీకగా
ధవళ వర్ణం శాంతి మంత్రపు చిహ్నమై
పైరు పచ్చల భారతానికి హరిత వర్ణం అమరిన
భరతమాత కీర్తి శిఖరం
శతాబ్దాల పొరుపై విజయకేతనం
ఆసేతు హిమాచల పర్యంతం
స్వేచ్ఛా జీవన ప్రసాదితం
భారతావని కీర్తి శిఖరం