వేయి జన్మల ఊపిరి
వేయి జన్మల ఊపిరి


మనో పంజరంలో ఆత్మీయ చిలక
తన్మయత్వం పూసుకుని
ఇష్టాన్ని తలచుకుంటూ
యుగాలైనా గడిపేస్తుంది
ఆ ఊసుల మాయజలంలో పడి
దూరాన్ని కూడా చెరిపేస్తూ
ఆత్రుత పల్లకీనెక్కి
తలపులన్నీ తరలిస్తూ
గుండెను చెవి చేస్తుంది
ఆ ఊసుల లోతు వెతుకులాటలో
వేదన కాయాన్ని కాల్చేస్తున్నా
రోదన దిగంతాలకు వ్యాపించినా
గుండె గాయాన్ని ఊరట పూతతో
నయం చేయాలని వెంపర్లాట
ఆ ఊసుల వినికిడి చెవిన పడగానే
ఆశనే ప్రాణంగా చేసుకుని
అనుబంధపు లతలు పెనవేసుకుంటూ
చూపుల కవాటాలు వెతుకుతాయి
కొండంత బలన్నిచ్చే
ఆ ఊసుల కోసం
సాటిలేని మంత్రంగా పనిచేసే
తొలి ఊసులు కోరుకునే
హృదయానికి దగ్గరచేసి
జరిగే అద్భుతాన్ని చూడు
వేయిజన్మల ఊపిరివైపోతావు