ఒక్క ప్రశంస చాలు
ఒక్క ప్రశంస చాలు
తెలవారిన గడియారపు గంటలతో
ఆ పాదముద్రల అలికిడి
వంటింటి సామ్రాజ్యంలో
ఇంటి ఆకలి తీర్చే యజ్ఞానికి కంకణబద్ధమౌతుంది
పని పోరాటానికి నడుం బిగించి
చేతులు పాకానికి ప్రేమను జోడించి
పాత్రలలో రుచుల ఆరాటాన్ని కనబరుస్తూ
కంచం నిండుగా సంతృప్తిని వడ్డిస్తాయి
ఆప్యాయతను జుర్రేసినిండిన కడుపులు
మూగనోము పట్టకుండా
ఒక మెచ్చుకోలు నగను వేస్తే
తన ఆకలిని కూడా మరిచిపోతుంది స్త్రీత్వం
రోజంతా దశావతారాలెత్తుతూ
కుటుంబ అడుగులకు మడుగులొత్తుతూ
క్షణం నడుం వాల్చే
విశ్రాంతికి సైతం తనది అట్టడుగు స్థానమే
రేయి ప్రశంస ఒక్కటి భాషించు
అదే వేయి ఏనుగుల బలం
తన దేహపు యంత్రం
మరుసటి ఉషోదయం చురుకుదనానికి