లీలాలోలుని లాలన
లీలాలోలుని లాలన


తలపులతోనే కొలిచే వలచిన
చిన్నదాని మనసనే కోవెలలో
కొలువుదీరి కులికే కన్నా ....!!
లీలాలోలా.. నీ లాలనలో లీనమైన
నిర్మలమగు నా అనురక్తిని
ఎటుల తెలుపను ఇంతకన్నా...!!
మోయలేని ఎద భారాలను
అమేయమైన చూపుతో కొలిచే
మాయలోడి కన్నులు మూయశక్యమా
తలచినంతనే వలచిన చెలి
చెంతవాలి కనులు మూసి కవ్వించే
చిలిపి మువ్వ గోపాలుడే
వెదికే ఎదురుచూపులను
వేదన చెరలో ఖైదుచేయక
అవ'లీల'గా అందే మానసచోరుడే
చన్
నీటి చూపుతో
వెన్నెలే చిన్నబుచ్చుకునే
వెన్నంటి మనసున్నోడు
మిన్నంటి వెతలన్ని
మీద పడుతుంటే
వెన్నంటి ఉండే మన్నికైన తోడు
తిన్న మన్ను రంగైనా తనువుకంటుకుందేమో
తిన్న వెన్న వన్నేదో మనసునందుకుందేమో
కన్నుల కాంతిని మ్రింగేసే కేతువుని కృష్ణబిలమున బంధించాడు
తిన్ననైన తీరుతెన్నులు తెలిపే
పెన్నిధై ఆపన్నుల వెన్నుదన్నైనాడు
-మీ ప్రశాంత్
("సహరి" సమగ్ర వారపత్రిక అక్టోబర్ 2020 లో ప్రచురితమైంది)