పవిత్రతఖరీదు
పవిత్రతఖరీదు


ఐదేళ్లు గడిస్తేగాని జనాలు గుర్తురాని ఆధునిక గజినీలు
ఆచరణకు వీలుకాని హామీల నోములు నోచే హేమాహేమీలు
చెవుల్లో పూలమొక్కల విత్తులను మొలిపించే ప్రభుద్దులు
పెదాలమీదే పిండివంటలు వండే నవయుగ నలభీములు
రేవు దాటేసాక తెప్ప తగలేసే మహామహులు
పన్నాగాలు పన్నే పగబట్టిన పున్నమినాగులు
ఈ పెద్దల చేతులు తడిచాక మిగిలేదే అభివృద్ధికి ఆఖరి వాటా
ఏ కండువా నిఘంటువు చూసినా కానరాదు సేవ అనే మాట
ఎన్నాళ్ళో కృత్రిమ శ్వాసతో మూలిగిన నల్లధనం
ఇన్నాళ్ళకి స్వేచ్చావాయువు పీల్చుకునే చక్కని తరుణం
దొరల ఊరేగింపుతో వీధులు ఖాళీలేక ఎండిపోయెను యాచకుల డొక్క
పేనుకి పెత్తనమిచ్చావని వెక్కిరిస్తది వేలిపై వేసిన సిరా చుక్క
ఊగించే మత్తు మందులు ఊరించే ఐదు వందలే ఎర
లొంగిపోయావో నీకు నువ్వే వేసుకున్నట్టు ఐదేళ్ల చెర
స్వాములు స్వారీ చేసేందుకు అలంకరించిన వీపును ఓటుతో చేయకు అద్దెకి సిద్ధం
ఏలుబడికి అర్హతగా నేరచరితను చాటుగా చేయకు రాజ్యాంగబద్దం