శీర్షిక : తెలుగు భాష
శీర్షిక : తెలుగు భాష


అంశం : తెలుగు భాష
శీర్షిక : తెలుగు
రచయిత : స్వర్ణలత
ఒకచేత జ్ఞానపూర్ణ కుభం, మరో చేత పంటచేలను పట్టుకొని తెలుగు తల్లి వచ్చే తెలుగు భాష తన బిడ్డయని
ఒక చేత ముత్యాల జొన్న కంకి, మారో చేత బంతిపూలతో సింగారించిన బతుకమ్మను పట్టుకొని వచ్చే తెలంగాణా తల్లి నేనూ తెలుగు భాష తల్లినని
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ అయిన తెలుగు భాష సుమధురం
తెలుగు బిడ్డగా నా మాతృ భాషకందిస్తున్నా ఈ కావ్య నీరాజనం
అలంకారాల అభివర్ణణలను అందంగా అలంకరించుకొని
ఛందస్సుతో చందన తిలకం దిద్దుకొని
సంధులు, సమాసాలను కాలిమువ్వలుగా చేసుకొని
అచ్చులు, హల్లులు కలబోసిన నడకలతో నాట్య అల్లికలల్లుకొని
ఎందరో కవుల కలములలో నాట్య ముద్రికలు ముద్రించిన తెలుగు భాషకు వందనం
ఆ కావ్యాలను ఆస్వాదించిన వారి హృదయాన చిగురించేను సంబరం
నే అమ్మ కడుపున వున్నపుడు విన్న ఆదిరాగం
బుడి బుడి నడకలతో అమ్మతో కలిసి వేసా తెలుగు మాటకు ఆది తాళం
నాతో నేను ముచ్చటించేందుకు వారధిగా నిలిచిన మౌన స్వరం
నా ఈ తెలుగు భాష నాకు దేవుడిచ్చిన వరం
నే చేస్తున్న తెలుగు భాషకు అభివందనం
రాయలు రాజ్యమేలిన రతనాల సీమ జన సింహాసనం
ఆ రాయలే దేశ భాషలందు తెలుగు లెస్స అని అలంకరించారు నీకు మకుటం
ఎందరో కవుల పొగడ్తలతో తేనెలూరిన తెలుగు కమ్మదనం
తేట తెలుగువంటి పద్యాలు, తీయని పాటల ఘని నింపుకున్న మహా సంద్రం
ఎంత తోడి చదివినా తరగని నా తెలుగు సాహితీ సంద్రం
నవాబు నిరంకుశత్వంలో నలిగిపోతూ ఇస్లాం పదాలతో పరిణతి చెందిన పరిమళం తెలంగాణా త్యాగస్వరం
సీమ సింహాల పౌరుషం భాషకు చేర్చి,పరుషమైన భాషలో ఆప్యాయత అనే సరళత్వ సొంపుల సొగసులను దిద్దిన సీమ సౌందర్యం
గోదారి గల గలలు , కృష్ణమ్మ కిలకిలలు , సుతిమెత్తని పూతరేకుల కమ్మదనం కలిపి అచ్చ తెలుగు అందాలొలికిస్తున్నది ఆంధ్రా అందం
ఇలా యాసలెన్ని ఉన్న భాష ఒక్కటైన పంచామృతం
ఎంత విన్నా చేదు రుచి ఎరుగని మధురామృతం
రఘువంశ వీరుని ఆనవాళ్లను ఋజువులుగా దాచిన గోదావరి తీర గానం
కొండపల్లి బొమ్మలను కూచిపూడి కళళనుదిద్దిన కళామాతృత్వం
ఏ తరువు తన సాటి లేదని నిలిచిన తిమ్మమ్మ మర్రిమాను సోయగం
శిథిలమైన శిల్ప కళా తోరణాలెన్నో దాచిన మందిరం
తరగని చరితను కలిగిన చరితం నా ఈ తెలుగు చరిత నందనం బహు సుందరం
తెలుగు గడ్డకు దూరన ఉన్న తెలుగు బిడ్డకు తెలిసేను తెలుగు వినపడని లోటుతనం
తెలుగువారా, మీరంటూ కులమతాలకు తావులేక కలుపుకొని పంచుకొనేరు ఆత్మీయతా భావం
అందలమెక్కిన ఆంగ్ల మోజులో అణచబడి భావితరాలకు దూరమవుతున్నది మాతృత్వ మూలధనం
ఇలా తెలుగు నేలపై తెలుగు భాషకు పట్టిన తెగులు మన దుస్థితికి నిదర్శనం
ప్రతి ఒకరు కర్షకులై కృషితో తెగులును తరిమికొట్టి తెలుగుకు అందిద్దాం వెలుగుల పూర్వ వైభవం