STORYMIRROR

Swarnalatha yerraballa

Abstract Inspirational

4  

Swarnalatha yerraballa

Abstract Inspirational

ఆధునిక సమాజం

ఆధునిక సమాజం

2 mins
3

మానవ!

సమాజమంటే ఏమిటోయి?

నీతో కలిసిన నలుగురే కదోయి

నీవు అందులో ఒక్కడే కదోయి


నలుగురు కలిసిన ఏర్పడే సంఘాలు

నవవిధమైన నడవడికల బ్రతుకులు

కుటుంబ కలిచివేతలకు తీసుకొనే ప్రాణాలు

పడ్డ నొప్పికన్నా పరులకళ్ళు పడ్డాయేమో అని వెతికే వైనాలు

నేటి సామాన్యుడి సగటు సమస్యలు

మానవ!

సమాజమనే భయం మానవోయి

ఆత్మ గౌరవం అంటూ నిన్ను నీవు మోసం చేసుకోకోయి

ఎన్నో మార్పులతో ఈ సమాజాన్ని నిత్యనూతనం చేయాలోయి


ఎవ్వరికీ ఎవ్వరనే సంబంధాలు

అనుబంధాలు ఆవిరైన దారులు

ధన గర్వ దౌర్జన్య దారుణాలు

నేటిసమాజానికి నీడనిస్తున్న తరువులు

ఆ నీడలో పెరిగిన చట్టం, న్యాయం కనులులేని న్యాయదేవతకు పాదాలు 

మానవ!

నీ కర్తవ్య పాలనను తెలుసుకోవోయి

నీ నడవడికను మార్చుకోవోయి

మెరుగైన సమాజ నిర్మాణమునకు పునాది నిర్మించవోయి


అందమైన పూలలా అరవిచ్చిన దరహాసాలు

పువ్వు చాటు ముల్లులా గుచ్చే వెటకారాలు

యదకంటని అభిమానాలు

పెదవెంట జాలువారే తేనే మాటలు

ఈ సమాజం ధరించిన అలంకారాలు

మానవ!

తేనే బుట్టలో పడకోయి

అది తీయటి విషమని తెలుసుకోవోయి

యదను గుచ్చిన ముల్లు గాయం మరవకోయి



చుక్కల మణిహారాలతో మెరిసే ఆకసం హొయలు

వాటి ఆహార్యంతో ఆకట్టుకొనే నీ నయనాలు

చంద్రుని చలువజ్యోతితో విరిసే నిశి సొగసుసులు

ఆ సొగసుల డాంభీకానికి దాసోహం అయ్యే ఎన్నో మదులు

కానీ ఇవి సాధు వేష ధారణలో వున్న రావణాసురిడికి ప్రతీకలు 

మానవ!

నిశి తళుకులు ఎన్నటికీ శాశ్వతం కాదోయి

నెలజోడు రాకతో సొగసులు నేలకొరిగేనోయి

నయవంచకుల మదిలోని నిశి తెలుసుకోవోయి


సాంకేతికతతో మనకు మనమే కట్టుకున్న ప్రహారీలు

పక్కవారెవరో తెలియని ఒంటరి ప్రయాణాలు

బహుదూరాన ఉన్న వారితో మమకారం లేని ముచ్చట్లు

బతుకుదారికి పనికిరాని సమూహాల సంగతులు

ముఖపరిచయం లేని స్నేహాలు సమాజంలోని మోసానికి ముందడుగులు 

మానవా!

అయినవారెవరో తెలుసుకోవోయి

ఆత్మీయులు లేని ఒంటరి ప్రయాణం ఎచ్చటికోయి 

దూరపు కొండలు నునుపన్న సత్యం మరవకోయి


ఆర్ధిక స్థిరత్వం లేని వృత్తి ఉద్యోగాలు

ప్రయాస లేని ఆశతో సాగే జీవన నావలు

అత్యాశలు హరించిన ఆనందంకై వెతుకులాటలు

ఆ వెతుకలాటలో ముగిసే యవ్వన రాగాలు

వడ్డీల చక్రవ్యూహంలో ముగిసే జీవితాలు 

మానవా!

మది పగ్గాలతో ఆశను నియంత్రించవోయి

డాబు కోసం పరులతో పోటీ పడకోయి

అందమైన యవ్వనాన్ని ఆనందంగా అనుభవించవోయి



కుల కాపు కాసే కుటిల రాజకీయాలు

పథకాల ఫలాల కోసం ఓటు వేసే ఓటర్లు

సమస్యలకై సాయుధమవని వార్త ప్రసంగాలు

సామరస్యం లేక సతమతమవుతున్న మధ్య తరగతి సామాన్యులు

ఓ సామాన్యుడా!

తిరుగుబాటే నీ సాయుధమని తెలుసుకోవోయి

ధర్మ అస్త్రమై నీవు కదంతొక్కవోయి

అధర్మ అణచివేతలో సవ్యసాచివై సాగాలోయి



వాహనాల పరుగులతో హోరుమనే రహదారులు

వాటి శబ్ద శృతితో పట్టే సూర్యోదయ హారతులు

అదుపులేని వేగంతో పోటా పోటీ సైయ్యాటలు

అదుపుతప్పి మృత్యు ఒడి చేరే ఎన్నో ప్రాణాలు

సాయం మరచిన సంఘం బంధించే చిత్రాలు

నేటి సమాజ నిర్దయకు దర్పణాలు

మానవ!

వేగం నియంత్రించిన పెరిగేను నీ జీవితలయ రాగమని తెలుసుకోవోయి

సాయం చేసి మానవతా ధర్మాన్ని నిలబెట్టవోయి

బంధించే చిత్రాలకన్నా బతికించే బ్రతుకులు మిన్న అని తెలుసుకోవోయి


Rate this content
Log in

Similar telugu poem from Abstract