" రాజసంలేని రాజ్యాంగం "
" రాజసంలేని రాజ్యాంగం "
రాజసంలేని రాజ్యాంగం - RK ========================
రాక్షసంగా రాజకీయరంగంలో రగులుతూ
పరిధుల్లేని అధికారాలకోసం కదులుతూ
విలువల్ని, హక్కుల్ని డబ్బుతో తొక్కుతూ
భారతావనిలో అదుపులేని పరుగులెడుతూ
అహంకారపునీడలో అవినీతివాడలో
అకృత్యాల ఓడలో ప్రయాణిస్తూ ఆకాశానికి
అత్యాశల నిచ్చెనలేసిన ఆకతాయిలకి
రాజ్యాంగమేసే కదా సరితూగే సంకెళ్లు
హక్కుల్లేని అభాగ్యులకి, గూడులేని శరణార్ధులకి
చితిమంటల్లో చీకట్లని తరిమిన బ్రతుకులకి
నగ్నశరీరానికి ఆకలిమంటతో చలికాచి,
పర్రెలుజీరిన భూమికి కన్నీళ్లవర్షంతో సేద్యంచేసి
నాగళ్లతో నల్లటినేలా తలలో పాపిట్లని పర్చేసి
పచ్చనిపంటల్ని పసిడిరాసులుగా పోగేసి
మెతుకులు స్వేచ్ఛగా తినలేని సేద్యకారులకి
రాజ్యాంగం తెచ్చే కదా పక్షిరాజు రాజసం
గురుకులంలో కదలని గుండ్రాయిలా మారి
పండితుడి విచిత్రాలతో వినీలాకాశంలోకి చేరి
అమాయకత్వమనే ముసుగులోని అభాగ్యులకి
చట్టమనే రెక్కలుచాచి అతిచేసే అధికారులకి
సమాజపు అట్టడుగు పొరల్లోని అన్యాయాలకి
సమరశంఖపు స్వరాలతో కృషిచేసిన ధీరులకి
పరిధుల పల్లకిలోనుంచే పలకరించే విద్యాదేవిని
సర్వజన ప్రాథమిక హక్కుగా మార్చే కదా
న్యాయానికి దారులువేసి నేరాల కోరలు పీకి
పటిష్ఠ చట్టాలుచేసి అన్యాయపు తీరాలు తాకి
మతాలకి స్వేచ్ఛనిచ్చి వాటిమధ్య వ్యాజ్యమిచ్చి
ఐక్యతకు తలమిచ్చి, సమగ్రతకి తనువిచ్చి
బానిసత్వానికి సెలవిచ్చి భాగ్యపురాణికి కొలువిచ్చి
పురిట్లోని నిర్జీవానికి పుత్తడిబొమ్మగా మార్చేసి
వాడినపుష్పానికి సువాసనలు అతికించి
రాజ్యాంగం ఉప్పెనకి సహితం ఊరటనిచ్చే కదా
కన్నీటి బ్రతుకునావలకి ఇరుకైన రొచ్చు త్రోవలకి
ధనవంతుడి ఇంపుకి దారిద్ర్యుడి కంపుకి
రాజ్యాంగం సమానమైన ప్రేమ చూపే కదా
దారిద్ర్యపు మాటున ఎండిన డొక్కలచాటున
దాగిన ఆకలి గొంతెత్తి స్వేచ్చగా అరవడానికి
అధికారంపేరుతో అక్రమాలపోరుతో
అలసిసొలిసిన అమాయకుడి జీవితానికి
దుర్భేద్యమైన కవచాన్ని ఏర్పర్చడానికి
గల్లీనుండి ఢిల్లీవరకు ఒకేచట్టం తెచ్చే కదా
బానిసత్వానికి అలవాటుపడి బలానికి రాజీపడి
బలహీనుడిగా బ్రతకడానికి బరితెగించి
బ్రతుకుచిత్రాల్ని మెడలో తగిలించుకొని
బలిపశువుని చేసి బలిపీఠంపై నరికినా
మౌనంగా భరించే అమాయకుణ్ణి కాపాడలేకా
పొట్టకోసం పోరాడేశక్తిని పోగొట్టుకొని
తలపొగరుని ఆకలికోసం తాకట్టుపెట్టేసి
జీతంకోసం జీవితాన్ని కోల్పోయిన అంధున్ని
కాపాడలేని రాజ్యాంగం రాజసాన్ని కోల్పోయే కదా
అడవి మృగాలు వేటాడటం మారనట్టుగా
అమాయకులపై అకృత్యాలు ఆగనట్టుగా
ఆకలిరోదనలు నిరంతరం మిన్నంటినట్టుగా
రాజ్యాంగం రక్షాసక్రీడలముందు తలవంచే కదా
శవాలగుట్టలతో పెళ్లి పందిరేసిన వేషం
పదిలమైనా జీవితాల్ని దోచుకోవడం కోసమేగా
తమ తప్పుల జీవితాన్ని తడబడనియ్యకుండా
తమ దుస్సాహాసాల్ని కనబడనియ్యకుండా
డబ్బనే ముసుగుతో న్యాయాన్ని అలంకరించి
సామాన్యుడికి అందని ద్రాక్షగా మార్చేసి
న్యాయనికి అన్యాయం చేస్తున్న నీచుల్ని
మార్చలేకా రాజ్యాంగం చతికిలపడే కదా
******** సమాప్తం*******