స్నేహితురాలికి ప్రేమ"లేఖ" కవనం
స్నేహితురాలికి ప్రేమ"లేఖ" కవనం


నడిరేయి చీకువాలు ఆవహించిన నా అంతరంగమున,
ఉషోదయపు భానుడి కిరణాలు నీ పలకరింపు సరిగమలేగా!
పొద్దస్తమాను కార్యకర్మములతో అలసిన నా దేహామున,
రాతిరికి సేదతీర్చు జాబిలి కౌముది నీ ఊసుల లాలిపాటేగా!
ఒంటరిపాటు ఘిరాయించి ఏకాకిలా మిగిలున్న నా మనువున,
ఆనగానుంటూ దన్నుగా నిలిచింది నీ మరువరాని చెలిమేగా!
ఒకే తలంపుతో ప్రయాణం సాగించిన మన గమనమున,
ఇచ్చిపుచ్చుకున్న కానుకలు మనకున్న అభిప్రాయాలు మాత్రమేగా!
పరలింగపు పరిమళాలు దరిచెరని నా నాసికా రంధ్రమున,
గంధముల సువాసనలను వెదజల్లింది నీ నెయ్యమేగా!
పరనెయ్యపు అభిరుచులు ఎరుగని నా జిహ్వ నరమున,
మాధుర్యపు కమ్మదనాలను పంచింది నీ ప్రణయమేగా!
నీ ఆకారము అభిదర్శించినది,
నువు పంపిన సందేశపు అక్షరాలలోనేగా!
నీ కంఠస్వరమును ఆలకించినది,
ఆ అక్షరాలతో పేర్చిన పదాలలోనేగా!
నీ ఊహలలో విహరించినది,
ఆ పదాలతో కూర్చిన వాక్యాలలోనేగా!
ఈనాటి నా అక్షరాలలో ఆయువు నింపినది, పదాలకు ప్రాణం పోసినది,
వాక్యాలకు వారధి కట్టినది, కవనాలకు మెరుగులు దిద్ధినది, రచనలకు నాంది పలికినది ఆనాటి నీ సహకార సావాసమేగా!
మన ఆ ప్రయాణంలో అసత్యాలు నీకు నచ్చవని,
నీ ముందర మాత్రమే కాదు నీ వెనుక కూడా సత్యముగానే ప్రతి క్షణం మెలిగాను కదా నేస్తం..!
కానీ ఎవరో ఏదో అన్నారని,
అన్నాళ్ళ నాపై విశ్వాసం వీగినదా?
మెప్పులు, గొప్పలు నీకు పడవని,
వాటిని నీ దరికి కూడా చేర్చనీయలేదు కదా నేస్తం..!
కానీ, మరెవరో నీ శ్రవణమునేదో చేర్చారని
మన స్నేహబంధం సన్నగిల్లినదా?
ఆనాడు నీ
పాలిట రక్షణగా భావించిన నా కరములే,
ఈనాడు కబంధ హస్తాలుగా నువనుకొని దూరమవుతుంటే!
నువు విడివడిన తదుపరి కలిగిన వేదనను,
ఆనాటి నుండి (రెండేండ్లు పైనే) అనుక్షణం
నే అనుభవిస్తున్న ఆ ఆవేదనను నీకు తెలపాలనున్నా...
మన మధ్యనున్న కొన్ని దుష్టశక్తులు ఆడుతున్న నాటకాలు,
ఎరిగి నేను, ఎరుగక నువ్వు బలవుతూ..
నా వాణిని నీకు వినిపించలేకున్నా..
నా దుస్థితినీ నీకు చూపించలేకున్నా...
ఇదేమెరుగని నీవు సైతం,
నన్నపార్థం చేసుకుంటూ, నాకు మరింతగా దూరమవుతూ
నీకై తన్మయత్వంతో వేచివున్న నా కనుల కొనల వెంబడి
కొలను గాంచి కన్నీటి సంద్రాన్ని సృష్టించుట నీకు తగునా!
మనమధ్య అవాకులు చవాకులు సర్వసాధారణమేగా!
ఈ మాత్రానికే నను జీవితాంతం దూరం పెట్టాలా?
ఎందుకో తెలీదు, తట్టుకోలేకున్న ఈ విరహ వేదనని!
తప్పని తెలిసినా, ఆపుకోలేకున్న నా మదిలో భావనని!!
ఇష్టంలేని నిను ఏదోలా పొందాలని కాదు!
కష్టపెట్టి నిను ఇంకేదోలా సాధించాలని లేదు!!
కనికట్టుజేసీ నిను మరేదోలా నిలుపుకోవాలని కాదు!!!
ఇదంతా నీకు వివరించి, నాపై నువు ఏర్పరుచుకున్న
ఆ ఒక్క ఋణాత్మక ధోరణిని తొలగించాలని తప్ప!!!!
హుమ్.. ఇక నా ప్రేమ సంగతి దేవుడెరుగు,
మన చెలిమి బంధమైనా మరలా చిగురించాలని ఆశతో,
ఒకింత అత్యాశతో...
నా ఆలోచనకు పదునుపెట్టి, నా కలానికి పనిపట్టి
ఆవేదనతో ఉప్పొంగుతున్న నా ఆలోచనలను ఓ కవనంలా నీ ముందర నిలపాలని నా ఈ చిన్ని ప్రయత్నం
నీ దరికెప్పటికైనా చేరేనా ?
ప్రేమతో..
- సత్య పవన్✍️✍️✍️