జీవన సంక్రమణం
జీవన సంక్రమణం


ఆరుగాలం కష్టాల బరువును
భుజాలకెత్తుకున్న పల్లెతల్లి మానసపుత్రుడు
పొట్టను పాలు పోసుకున్న
సస్యసిరులు ఇంటికి చేరినప్పుడు
అదికదా అసలు సిసలైన సంక్రాంతి
పౌష్యలక్ష్మి నట్టింట నాట్యమాడుతుంటే
హాలిక హృదయ గోదారి ఉప్పొంగి
కళ్ల కాలువలు కట్టలు తెంచుకున్నప్పుడు
అదికదా అసలుసిసలైన సంక్రాంతి
పసిపిల్లల హృదయ పతంగులు
నింగి చేరి స్వేచ్ఛగా విహరిస్తూ
సంబరం అంబరాన్ని తాకినప్పుడు
అదికదా అసలు సిసలైన సంక్రాంతి
పట్టణాలు పల్లెతల్లి ఒడిచేరి
అమ్మచేతి రుచులతో కడుపు నింపుకుని
సరస సల్లాపాలతో వాకిలి సందడి చేస్తుంటే
ఆదికదా అసలుసిసలైన సంక్రాంతి
ధనం నిండిన జేబుల నాలుకలు
రుచులమాధుర్యాన్ని గ్రోలుతుంటే
ఆకలి కేకలు పెడుతున్న పేద పేగులు
నడిరోడ్డుపై చేస్తున్న కరాళ నృత్యంతో
కాంతి హీనమౌతున్న సంక్రాంతి
జీవన గమనంలో మారిన నాగరికత
సంస్కృతి రాతలను చేరిపేసుకుంటూ
నాటి అనుబంధాల బంధం అవిరౌతూ
నేడు జీవకాంతి కరువైన పెద్ద పండుగ