STORYMIRROR

Sandhyasharma yk

Drama

4  

Sandhyasharma yk

Drama

గురుదేవోభవః

గురుదేవోభవః

1 min
261


లేలేత పూల తీగలా 

ఆతని పాదాలనల్లుకుపోతుంటే

ఓ భోధి వృక్షమై విస్తరిస్తాడతడు!


ఒంటరి ప్రయాణానికి సూచికగా

అండదశ నుంచి

ఆకాశగమనం వరకు

చిటికెన వేలుపట్టి

ఆతని అడుగుజాడల్లో

అక్షరలోకపు

దారుల వెంట పయనిస్తుంటే

జలవిహారములు

వసంత విలాసములు ఎదురయ్యేవి

కనువిందు చేసే

అనంతమైన ఇంధ్రదనస్సులు...

కనికట్టు చేసే ఎండమావులూ

తన వెంటే...


బీడు నేల మీద చూపుడువేలుతో

బీజాక్షరాల విత్తు నాటిందాతడే


లేత పెదాల మీద పదాల తుళ్ళింతై

విశాల నదీ పరీవాహక పాఠమై

విస్తరిస్తూ నా చిన్ని ఎడారి గుండెల్ని

తడిపి మనసు మాగాణి మీద

పచ్చదనాన్ని పులిమిందాతడే!


విశాల ప్రపంచపు తలుపులు తెరిచి

వేకువలో ప్రకృతినొక పాఠశాల చేసి

నలుదిక్కుల నల్లబల్ల మీద

శ్వేతాక్షర జలపాతమై

దుముకుతూ పశ్చిమ కనుమలకు

బార చాపితే సూరీడై చెవుల్లో

సుద్దుల్ని నూరిపోస్తాడతడు!


తరాల చరితల్ని జ్ఞానవాహినిలో తడుపుతూసాగే 

అవిశ్రాంత పథికుడాతడు!


మట్టి ముద్దలకు ఊపిరూది

మహత్తర జీవశక్తి నింపిన

పారదర్శక ప్రతిరూపం

ఆతడే జాతికి జీవధాతువు!


రెక్కలొచ్చి నేనెగిరిపోతే

దిక్కుదిక్కునా దారిచూపుతూ

వెన్నుతట్టి ఒక్కొక్క మెట్టు 

నన్నెక్కిస్తూ 

ఆఖరి మెట్టు మీద ఆతడే!


చీకట్లను తగలబెడుతూ

దారిచూపే వెలుగు కాగడాలా

ఆతడే!

ఋణం తీర్చుకుందామంటే

ఆతని అనంతమైన కరుణ ముందు

నా సమస్త దేహమూ దూది పింజలా

తేలిపోతోంది...

నా కన్నీటి మలుపులో

తన రూపం గుర్తురావటం లేదు

ఆయన పాదాల తప్ప..

ఆ పాదాల స్పర్శ తో 

నా కళ్ళలోని వెలుగు దీపం

అనునిత్యం వెలిగిస్తూనే 

వున్నాను...


🙏వందే జగద్గురుమ్.🙏



Rate this content
Log in

Similar telugu poem from Drama