akhila thogari

Drama Romance

5.0  

akhila thogari

Drama Romance

ఓ ప్రియ...

ఓ ప్రియ...

4 mins
566



ప్రియతమా

ప్రియమైన శ్రీమతి గారికి,

మొట్టమొదటిసారి నిన్ను చూసిన క్షణాలు....నా కళ్ళ ముందు మెదులుతుంటే.... నీ చూపులు నా మనసును ఇంకా గుచ్చుతున్నాయి....నీ నీలి కన్నులు అంతలా నన్ను నీ వైపు ఆకర్షించుకున్నాయి.

అనుకోకుండా వచ్చిన నీ బర్త్ డే పార్టీ లో.... నేను నిన్ను సమీపిస్తున్నాను అనే సమయంలో..... పవర్ ఫట్టున ఎగిరిపోయింది.

ఎవరైనా చూస్తే అయ్రన్ లెగ్ అని తిట్టేసుకుంటారేమో.... అని అటు ఇటు పిచ్చి చూపులు చూస్తున్న నాకు.... కొవ్వొత్తుల వెలుగులలో తల ముంగురులు సరిచేసుకుంటూ.... చంద్రబింబంలా మెరుస్తున్న నీ మోహాన్ని చూస్తూ మైమరిచిపోయాను.

ఎవరో లాక్కెళ్ళినట్టుగా నాకు తెలీకుండానే నా అడుగులు నీ వైపు వేసాయి.... నేను నిన్ను సమీపించి .....హ్యాపీ బర్త్ డే ప్రియ గారు అని చెప్పగానే.... అప్పడికి నేనెవరినో నీకు తెలియకపోయిన .... నీ మొహం చిరునవ్వుతో మెరిసిపోతూ..... నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ థాంక్యూ😍 అని చెప్పగానే .... పారిపోయిన పవర్ తిరిగి వచ్చింది.

ఆ వెలుతురులో నన్ను గుర్తుపట్టి.... నువ్వు ఎవరు అని అడిగితే అందరి ముందు పరువుపోతుందేమో అని... గబగబా అక్కడి నుండి పరుగెత్తుకొచ్చాను.

నేనైతే నీ నుండి దూరంగా వెళ్ళాను కానీ....నా మనసు మాత్రం నీ దగ్గరే ఉండిపోయింది... నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావని గాల్లో తేలిపోయాను.....నా మనసు ఎగిరిగంతేసింది.... నాకు కూడా ఎగిరి గంతేయాలని ఉన్నా.... చూసే వాళ్ళు వీడు పిచ్చోడు అనుకుంటారేమో అనుకుని.... ఆ పని లోలోపలే చేసాను😁... (అంటే మనసులో అన్న మాట).

పార్టీ అయిపోయి అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా.... నా కళ్ళు మాత్రం ఇంకా నీ కళ్లనే వెతుకుతున్నాయి..... నా అడుగులు నీ జాడకై నీ వినకే తిరుగుతున్నాయి.

కంటికి కనిపించనీ కలవరం ఏదో మదిని కలవరపెడుతోంది.... నిమిషానికి 70 సార్లు కొట్టుకునే గుండె....100 సార్లు కొట్టుకుంటు..... ఆ కలవరం నువ్వే అని చెప్తుంది.... నీ స్పర్శ తగిలిన ఈ చెయ్యి.... నీ చిటికెన వేలు పట్టుకోవాలని ఆశ పడుతుంది అని అర్థం అవుతుంది.

ఇక ఆలస్యం చేయకుండా నా ప్రేమ విషయం నీతో చెప్పేసాను..... ఆ క్షణం నన్ను చూస్తూ కనురెప్పలు టపటపా వాలూస్తు.... తల కిందికి దించుకుని.... కనుల చివరి నుండి నన్ను చూసిన చూపులు.... నా మది ఇంకా మర్చిపోలేదు.... నన్ను అలా చూసి నాకు సమాధానం ఏమి ఇవ్వకుండా వెళ్లిపోతుంటే.... నా ప్రాణం తీసుకెళ్తున్నట్టు అనిపించింది.... ఏం జరుగతుందోనని ఆ రాత్రి కంటి మీద కునుకు వేయలేకపోయాను.

కానీ రెండు రోజుల తరువాత.... నా ప్రేమనీ ఆక్సెప్ట్ చేస్తూ.... నీ నుండి వచ్చిన ఫోన్ కాల్ కి.... ఉబ్బితబ్బిబైపోయాను.... ఈ సారి ఎవరు ఏమనుకున్నా సరే అనుకుని.... మనసులో కాకుండా రోడ్డు మీదే పిచ్చి గంతులు వేసేసాను.

ఆ తరువాత మన ఆనందానికి హద్దులు లేవు.... బీచ్ లు పార్క్ లు సినిమాలు అంటు....చెట్టాపట్టాలేసుకుని ఊరంతా చుట్టేసాము.... చివరిగా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాక అప్పుడు తెలిసింది.

నీది నాది.... వేరు వేరు కులాలు.... వేరు వేరు మతాలు అని.... మీ ఇంట్లో...మా ఇంట్లో కూడా మన పెళ్లికి ససేమీరా ఒప్పుకోలేదు....నీకు వేరే సంబంధాలు చూస్తుంటే.... ప్రేమించిన అమ్మాయినీ వదులుకోలేక.... వేరే గత్యంతరం లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవలసి వచ్చింది.

నేను అలా చేయడంతో కన్న వాళ్ళు నీళ్ళు వదిలేశారు.... బ్రతికుండగానే పిండాలు పెట్టేశారు.... మనసుకి చాలా భాధగా అనిపించింది.

ఒక మగాడిని నాకే ఇంత భాధగా ఉంటే నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండి ఉంటుంది..... కానీ ఏ రోజు... ఆ బాధ నీ కళ్ళల్లో కనిపించకుండా జాగ్రత్త పడుతున్నావని నాకు తెలుసు.... అందుకే అమ్మలా ప్రేమ పంచుతూ.... నాన్నలా భాధ్యత తీసుకుని.... కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను.

నిన్ను పెళ్ళి చేసుకున్న రోజు నేనొక ఉద్యోగం సాధ్యోగం లేని అసమర్ధుడిని.... మేడలో మహారాణిలా....పిలిస్తే పలికే నౌకర్ల మధ్యలో బ్రతికిన నువ్వు.... కట్టు బట్టలతో నాతో పాటు వచ్చి.... పడరాని కష్టాలు పడ్డావు.

ఎన్ని కష్టాలు ఎదురైనా.... నన్ను మొదటి సారిగా చూసినప్పుడు నీ కళ్ళలో ఏ ప్రేమ అయితే కనిపించిందో....ఇప్పటికీ కూడా నా మీద నీ కళ్ళలో అంతే ప్రేమ...ఇంతలా ప్రేమించే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం.... ఐయామ్ సో లక్కీ బంగారం😍.

అలాంటి నీకు నేను ఏం ఇవ్వగలిగాను... నీ పేరుకు ముందు నా ఇంటి పేరును.... పేరు చివరన నా పేరును తగిలించడం తప్ప.... ఏం చేయగలిగాను.

ఈ రోజుల్లో అబ్బాయికి ఉద్యోగం లేదంటే.... వాడి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు....అలాంటిది నువ్వు.... నన్ను నమ్మి నీ సర్వస్వాన్ని వదులుకుని వచ్చావు.... నా కష్ట సుఖాలలో నా వెన్నంటే ఉంటూ ....అమ్మలా నాకు దైర్యం చెప్తూ వచ్చావు.

నీ ఎంకరేజ్ మెంట్ వలనే.... నేను ఈ రోజు ఒక పబ్లిక్ ప్రాసక్యూటర్ గా....సమాజంలో మంచి పేరు... గుర్తింపు...డబ్బు.... హోదా సంపాదించుకున్నాను.

చివరగా నేను నీకు లేఖ రాయడానికి కారణం ఏంటంటే.... పంతాలకు పట్టింపులకు పోయి....మనం మన తల్లి తండ్రులనీ.... మన తల్లి తండ్రులు మనల్ని దూరం చేసుకుంటూ వచ్చాము.

కానీ మన ప్రేమకీ జ్ఞాపకంగా.... మనకు పుట్టే బిడ్డ ఈ పంతాలు పట్టింపుల మధ్య....బంధుత్వాలు లేకుండా పోతాడు అనుకుని....నా బిడ్డకు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఉన్నారని....వాడు వాళ్ళ చేతుల మీదుగా పెరగాలని.... మీ అమ్మ నాన్నలతో....మా అమ్మ నాన్నలతో మాట్లాడాను.

అప్పుడేదో పంతాలకు పోయారు కానీ... ఇన్నేళ్ళ తరువాత వాళ్ళని కలిసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయారు....సంతోషం బాధ కలగలిపిన కన్నీటితో ప్రేమగా కౌగిలిలోకి తీసుకున్నారు.

నేను తండ్రిని కాబోతున్నాను అని తెలిస్తే కానీ.... అమ్మ నాన్నల బాధ ఏంటో నాకు అర్థం కాలేదు.... రేపటి రోజున మన బిడ్డ కూడా.... మనలా చేస్తే బహుశా మనం కూడా అమ్మ నాన్నల లాగానే ప్రవర్తిస్తామేమో అనిపించింది.... ఆ బాధ తట్టుకోలేకపోయాను రా.

నువ్వు ఐఏఎస్ (IAS)  ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి.... అమ్మ నాన్నలు....అత్తమామలు.... నీకు ఘనంగా స్వాగతం పలుకుతారు డియర్. లవ్ యూ బంగారం.

ఒక బర్త్ డే కి వచ్చి...నేను నీకు తల్లి తండ్రులను దూరం చేసి... కనీసం అత్త మామ అనే పిలుపుకు కూడా నోచుకోకుండా ....నా తల్లి తండ్రులను కూడా దూరం చేసాను.... ఈ సారి నీ బర్త్ డే లో నిన్ను వాళ్ళని కలపబోతున్నాను.

వాళ్ళు నిన్ను కలిసిన క్షణం.... నీ కళ్ళలో వెలిగే సంతోషం....కళ్ళారా చూడబోయే ఆ రోజు కోసం ఎదురుచూస్తూ,


                                                     ఇట్లు ,

     

                                             నీ ప్రియమైన శ్రీవారు,

   

                                           

         *:*:*:*::*:*::*:*:*:*::*:*:*:*:*:*::*:*

కులాలు మతాలు అంటు కన్న బిడ్డల ప్రేమని అర్థం చేసుకోకుండా.... మానవత్వం మరిచిపోతున్నారు

వాడు మంచివాడు కాదు....వాడిని చేసుకుంటే సుఖపడలేవు....అని చెప్పడం తప్పు కాదు.... వాడిది మనది వేరే కులం.... అని చెప్పి ప్రేమించిన వాళ్ళని దూరం చేయడం ఎంత వరకు న్యాయం...

మనుషులంతా ఒక్కటే అని చెప్పి....మధ్యలో ఈ కులాలు....మతాలు అంటు భేదభావాలు ఎందుకు???....

ఇలా చేయడం వల్ల ఎంతో మంది ప్రేమికులు.... తల్లి తండ్రులనీ ఎదిరించి....వెళ్ళిపోలేక....ప్రేమించిన వాళ్ళని తప్ప వేరే వ్యక్తితో జీవితం ఊహించుకోలేక....జీవితాంతం కలిసి బ్రతకలేక... కనీసం చావులో అయిన కలిసుండాలని... సూసైడ్ చేసుకుని.... కలిసి చనిపోతున్నారు

తల్లి తండ్రులను తప్పు పట్టాలని ఇలా చెప్పడం లేదండి.... కులం మతం అంటు మూర్ఖంగా ఆలోచించే వారి.... ఆలోచన ధోరణి మార్చుకోవాలని అని అనుకుంటున్నాను.... ఆశిస్తున్నాను


       *:*::*:*;*:*;;*;*;*;*;:*:*:*:*::*:*::*



Rate this content
Log in