నాస్టాల్జియా
నాస్టాల్జియా


నాస్టాల్జియా
మంచులా కరిగిపోయే కాలం
కొన్ని జ్ఞాపకాలను వెదజల్లుతుంది
దాచుకుంటూనో ఏరుకుంటూనో
కొత్త సంవత్సరంలో భయంభయంగా
అడుగిడతాం
సంగమించిన ఋతువులు
కొంతఖేదాన్ని కొంతమోదాన్ని
కలిపిన రంగుల రజాయిని కప్పుతాయి
రేపటిరోజుగురించి చింతను వీడమంటూ
మరో కొత్త సంవత్సరం వస్తుంది
బాధ్యతల త్రాసులో
మరికొంచెం బరువుపెరుగుతుంది
వయసును తరిగే కాలం కాలరెగరేస్తుంది
డిసెంబర్ మాసం ప్రత్యేకంగా పలకరిస్తుంది
విషాదం వసంతాలను గ్రీష్మపు మంటలను
పెళ్ళలు పెళ్ళలుగాజారే వర్షపు ధారను
ఊహించాలోయ్ మిత్రమా అంటుంది
'మిత్' లు వాడిపోతుంటాయి
మిత్రులు విడిపోతుంటారు
వాగ్వాదాల కత్తులు పదును కోల్పోతుంటాయి
గాదెలో ధాన్యంలా నెమరవేతే మిగులుతుంది
నెరవేరని కోరికలను వాయిదా వేస్తాం
మరో సంవత్సరం ఆశగా పిలిస్తుంటే
మారని జీవితాలకు ఓపిక రంగువేస్తాం
మార్కెటింగ్ టెక్నిక్ అనుకుంటూ
లోలోపలి కల్లోల సముద్రాలను
ఈదే శక్తినిస్తుందా కొత్త వత్సరం
కాలిపోయే ఆశలు వనాలు
కూలిపోయే కలలహర్మ్యాలు
మారేతేదీ.. మారని భవిష్యత్తు..
జమిలి ప్రయాణంచేస్తుంటాయి భాయ్
భయమెందుకు..మరో సంవత్సరం
మరో గమ్యం చేర్చదనీ తెలుసుకదా
కొన్ని మంచుపూల అనుభవాలను మాత్రం
ముడేసి గతంగదిలో దాచుంచుతాను
చివరి మజిలీలో చిదిమి దీపం పెట్టుకోవడానికి
డిసెంబర్ పువ్వు పరిమళంలా
చుట్టూ నాస్టాల్జియా గాలులు....