మట్టి పరిమళం
మట్టి పరిమళం
వేకువను పేనుతున్న నిశ్శబ్దాన్ని
ముక్కున కరచుకుందామని
రెండు పక్షులు ప్రయత్నపు గూడు కడుతున్నాయి
వెచ్చదనపు కోరికలా
చుట్టూ పలచబడుతున్న పుష్యమాసపుచలి
మౌనాన్ని పంచుతోంది
ఏకాంతపు వీణను మీటుతూ ఆహ్వానం పలికేందుకు
రాత్రి వదిలిన ముచ్చట్లమాలను ధరించింది కాలిబాట
మాటలరజాయి కప్పుకున్న మనుషులు
గమ్యాన్ని వెతికే కాందిశీకుల్లా ఉన్నారు
పచ్చని కాంతిపంచే ఒంటిస్థంభమొకటి
ధ్యానాన్ని పోగేసుకున్న ఇంటిపెద్దలా ఉంది
చీకటికి వీడ్కోలు పలికే వేకువ మహాచిలిపిది
కూడికలు తీసివేతల కూడలిలా కవ్విస్తుంటుంది
కదిలే ప్రవాహమై కాసేపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
అంతలోనే వెలుగు రేఖల ఊయలతో
కోయిలపాటవుతుంది
మంచుకడిగిన మట్టి పరిమళాన్ని కానుకిస్తుంది