రేయి స్వగతం
రేయి స్వగతం


రేయి స్వగతం
చిక్కటి చీకటి చలిగీతాన్ని అందుకుని నగరమంతా
తిరుగుతోంది
అక్కడక్కడా మెరిసి అద్దాల్లా వానబొట్లు
నేలకి ఎవరో బొట్టుపెట్టినట్టున్నాయి
తళుకుల వెనుక తారాడే కన్నీటిచుక్కల్లా
కొత్త సంవత్సరమింకా కొత్త పెళ్ళికూతురిలా
సిగ్గుపడుతోంది
ఆకలికేకలు ఆకలిచూపులను గ్రహించలేదు
అమాయకత్వాన్ని మింగేసే గడుసుదనం
అవకాశం కోసం చూస్తోంది
రోడ్డుమీద బిచ్చగాడు జోలె ఇంకా నిండలేదని
నీరసంగా నడుస్తున్నాడు
నిజాల నీడలను కూడా చూడని రాతిగుండెలతో
నీటిమీదరాతల్లా ఈమనుషులు చెరిగిపోయే జ్ఞాపకాలు
శపిస్తున్నాడో గొణుక్కుంటున్నాడో
వెలిగీ ఆరే ఎర్రలైటు మనుషులను చూసి
భయపడుతోంది
బాధ్యతలేని నగరంలో ఇనపకంచెల ఆంక్షలను
చుట్టడమే నయమనుకుంటోంది
నగరపు మెమరీకార్డులా ట్రాఫిక్ సిగ్నల్స్
మనస్తత్వాలను రికార్డుచేసే స్వగతాలు
అవును కొత్త సంవత్సరం కదా
రోజుమారినకొద్దీ మోయలేని అనుభవాల మోతబరువు
నెత్తినెక్కి నాట్యంచేస్తుందని తెలుసుకుంటుంది
మెత్తని కత్తిలాంటి కాలం గరకు గాజులా గాయాలపూతతో సిద్థంగా ఉందని తెలుసుకుంటుంది
పోటెక్కే తలపోటులా వివర్ణమై వర్తమానం
ఆశలు కల్పించలేకపోతుంటే
రేవు దాటిన నావలా రేపటి స్వప్నాలు
దూరంగా జారిపోతుంటే
కలవరపడే కొత్త సంవత్సరం చీకటినీడలో
భవిష్యత్తు అక్షరాలను దిద్దుకుంటోంది.