ఆశల ఆవిరి
ఆశల ఆవిరి


ఆశల ఆవిరి
ఎక్కడో ఒకగాలిపొర నావంక జాలిగా చూస్తోంది
అడుగువేయని శిలగామారావే అంటూ
మనసంతా విప్పారిన హేమంతం
సంతసాల పందిరి వేస్తోందని
మాలలుకడుతూ చలిసొగసు ఇల్లంతా పాకిందని
ఎలా చెప్పను
రేడియోలో ధనుర్మాస పాశురం
వివశంగా చుట్టేస్తుంటే
ప్రభాతం వేణువై అల్లుకుంటుంటే
టీపాయ్ పై పరిమళాల టీకప్పు
కొంటెగా నవ్వుతుంటే
చల్లదనపు స్పీడ్ బ్రేకర్లను దాటలేక
ఆక్షణాన వెచ్చదనపు కప్పుకు దాసుడనని
చెప్పలేక దిక్కులు చూశాను
ఇన్నాళ్ళు నీఅడుగుతో అక్షరం జతకలిసి కవితను అల్లేది
ఇప్పుడు తలుపు తీసి పుష్యమాసపు గాలిని ఆహ్వానించాను
అనుభూతులను వెంటతేకపోతుందా అని చెప్పాలనుకున్నాను
నా మేకపోతు గాంభీర్యాన్ని పరిహసిస్తూ
నాలుగు నవ్వుల్ని తలపై రాల్చింది
బద్దకానికి కారణాల కార్ఖానా వెతుకుతున్న మనిషీ
నువ్వేసే నాలుగడుగులు నీకు ఆశల ఆవిరిపట్టి
నిరాశల జలుబును వదిలిస్తాయికదా
ఆ నవ్వులను నా హృదయానికి అనువదిస్తోంది
ఎదురుగాఉన్న బాల్కనీ రాణి