శివుడు మావోడు
శివుడు మావోడు


భస్మధారి అట
శివుడు జడలు కట్టినాడట
జడలు కట్టి అందులో ఆకాశము చుట్టేసినాడట
దూకిన గంగమ్మను ఆ జడల్లో ఒడిసి పట్టినాడట
భగీరథుడు ప్రార్థించగా
శాపములు తీర్చమని గంగమ్మను భువికి పంపినాడట
కాష్టాల కాడ బూడిద పూసుకొని తిరుగుతాడంట
తిరిపెమెత్తుతాడంట
సంపదలూ ఇస్తాడంట
భక్తుని కోసం యముడినే కాలితో తన్నినాడంట
భక్తురాలి పాదాలు తల మీదెట్టుకుంటాడంట
ఓరి నాయనో
ఇసమంతా వచ్చి ఏం జేస్తదో అని దేవతలు రాక్షసులు వెనక్కి ఉరికినారంట
సామే నువ్వే కాయాల అని భోళా శంకరునికి మ్రొక్కినారంట
అంతా మన బిడ్డలే గదా అని సర్వమంగళ పార్వతమ్మకు జెప్పి
కాలకూట ఇసానికి ఎదురు బొయ్యి
అందరి కోసం ఇసం దాగి నా సామి
గొంతులో ఇసాన్ని దాచినాడంట
ఎవురి పాటికి వాళ్ళు అమృతం తీసుకోవాలె అనుకున్నరే గానీ
శివయ్యకు థ్యాంక్సు కూడ చెప్పలేదంట
ఎనకమాల దేవతలకు బాధ అయ్యిందంట
అయ్యో సామే తప్పయిపోనాది అంటే
సర్లే మీరందరూ నా వాళ్ళే గదా అని చమియించినాడంట
అందుకే ఎవురన్నా మీవోడు ఎవురు అంటే
శివుడు మావోడు అని చెప్తా
సిత్రం సామీ
అన్నీ నీవైనప్పుడు నేను మాత్రం నీ వాణ్ణి కాకుండా పోతానా
ఉలకవు పలకవు
నీతో దోస్తీ కడదామనే కదా నేను
నందీశ్వరుని చెవిలో చెప్పి లోపలికొచ్చింది
కూసింత స్నేహితం చెయ్యొచ్చు గదా
బయటంతా శివుడు మావోడు మావోడు అని చెప్తాండ
కాస్త కనికరించవేమిరా శ్రీకాళహస్తీశ్వరా!