చెట్టు....శ్రీనివాస భారతి
చెట్టు....శ్రీనివాస భారతి


ఏరా
పాస్ పోస్తన్నావా ఇక్కడ?
ఇంత పెద్దయినా కూడా ఇదేం బుద్ధి?
చీకటి రాత్రులన్న ధైర్యం నీది.
మీ తాతగారి నాన్నగారు నన్ను పెంచారు
రచ్చబండ తీర్పులయ్యాయిఅప్పుడు ఇక్కడే
మీ తాతగారో
పిల్లలకి పాఠాలు చెప్పేవారు..నా ముందే
ఆఫీసునుండి
అలసి పోయిన మీ తాత రావడానికి
పట్టే ఆ సమయంలో
నా ముందే పలకా బలపాలు పడేసి
కొమ్మలూపుతూ..పిల్లలంతా
కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో?
ముసలాళ్ళంతా నా నీడన పడుకొనేందుకు
ముందురోజు నుండే...ఎన్ని వాదనలో?
ఎవరొచ్చినా సరే
వెళ్తోన్న గాలినాపి
కొమ్మల్తో సేదదీర్చక పోతే
నాకేం తోచదు మరి
అతిధి మర్యాద అంటారటగా..మీరు
బంగిన పల్లి పండు నొక చేత్తో పట్టుకొని
రెండో చెయ్యి నా మీద వేసి
నా మేంగో రుచుల్ని పొగుడుతుంటే
అబ్బ..నా ఆకలి తీరిపోయేది...మీ తృప్తి చూసి
మీ నాన్న వదిలిన బోరు నీళ్ల త్రోవ
నాకెంతో బలాన్ని ఇచ్చింది...
నీ ఉయ్యాల బల్ల కోసం
నా శరీరం గాయం చేస్తే చిరునవ్వున ఓర్చుకున్నా
మీ అమ్మ చేతికర్రా నేనే.
ఇన్నాళ్ళకి కొంతైనా ఋణం తీర్చాననుకున్నా
ఇప్పుడు నువ్వు
నన్ను..నిలువునా నరికేస్తే
రేపటికి
ఆక్సిజన్ కొనుక్కోలేని.. నీ స్థితికి
జాలిపడ్డం తప్ప ఇంకేం చెయ్యగలను.
---------- -$$$$$$$$$----------