ఎంగిలన్నం
ఎంగిలన్నం
నేను
వేసాను
అమ్మ పొత్తిళ్లలో పాలు తాగుతూ
నిక్కరేసాను
నాన్న చెయ్యి పట్టుకొని బడికి వెళ్తూ
ఫాంటుకు... బ్యాగుకు మారాక
టీచర్లని వేధించడం మొదలెట్టాను
శరీరంలో హార్మోన్లు రెచ్చగొడితే
నోట్స్ లు కాగితాల ప్రేమ పావురాలు
అమ్మాయి వాళ్ళ బెదిరింపులు
ప్రేమ జైలు కౌన్సెలింగ్లు
అబ్బా ప్రేమ ఎంత మధురం?
నీతో ఎంగిలి ఐస్క్రీమ్, డ్రింకులు
నువ్వు పారేసిన వస్తు జ్ఞాపకాలు
ఒకరి కళ్ళల్లోకొకరం చూస్తూ
గడిపేసిన మధుర క్షణాలు
ఆకలి దప్పుల ఊసేలేదు ఇద్దరికీ
ప్రపంచంలో మనంత గొప్ప ప్రేమికులెవరు?
ఇప్పుడన్పిస్తోంది
ఆనాడు నేనొదిలేసిన
ఎంగిలన్నం
ఆప్యాయంగా అమ్మ ఎందుకు తింటోందో
నాన్నకు ఖర్చు పెరగ కూడదని కాబ
ోలు
డబ్బు లేకపోతే ఆకలి తీరదు
ఆకలి తీరందే ప్రేమ పుట్టదు
మనిద్దరి మధ్య పేదరికం
కలవకుండా పీట వేసుక్కూర్చుంది
ఇప్పుడు
నీ చిన్న కోర్కెలూ తీర్చలేని నేను
గొప్ప అసమర్థుడ్ని
అదీ నా తప్పేలే
రెండేళ్ల ప్రేమ పరిచయం లో
ఒక్కనాడూ
భవిష్యత్తు మాటలేం చెప్పుకోలేదు మనం
అమ్మ నెరిసిన జుట్టు ప్రాధేయపడింది
నాన్న ముడతల శరీరం ఏడ్చి మొత్తుకొంది
నా నల్లని మీసాలకు మాత్రం
నీ సోయగం తప్ప ఇంకేం కన్పించలా
ఇప్పుడర్ధం అయింది
ప్రేమ పుస్తకం నిండా
ఆకలి, బాధ్యత, జీవితం పేజీలు
ఎప్పుడూ ఖాళీగా ఉంటాయని
ఎవరికి వాళ్లే సరిగా నింపుకోవాలని
లేకుంటే
చిత్తుకాగితం, చిరిగిన విస్తరి లా
మనం కూడా ఏదో ఓ మూలకే...