చుక్ చుక్....శ్రీనివాస భారతి
చుక్ చుక్....శ్రీనివాస భారతి
రైలు వెళ్తోంది నెమ్మదిగా
అప్పుడే
ఆహారం మింగిన కొండచిలువలా
లోపలివాళ్ళు
కడుపులో దాక్కున్న జీవాల్లా
అరల్లో అటూ ఇటూ సర్దుకొంటూ
లోపల చల్లటి గాలికి
రైలు పళ్లు కొరుకుతున్నట్టుంది
టక్టాక్...శబ్ధాలొస్తూన్నాయి
దూరాల్ని దగ్గర చేస్తున్నట్టు
వేగం పెరుగుతోంది నెమ్మదిగా
జీర్ణం ఐన ఆహారంలా
కొండచిలువ బద్దకం వదిలినట్టు
ఆగింది దీపకాంతుల మధ్య
అజీర్తి ఆహారం కక్కేసినట్టు
కొందరు దిగిపోతున్నారు మెల్లగా
ఇంకొందరు గుహలోకి వస్తూ
మళ్ళీ ఆకలేసినట్టు .....
వయ్యారాల వంపుసొంపులు
నియాన్ లైట్ల మధ్య అందంగా
తీక్షణమైన కళ్ళలా
దూసుకుపోతోంది వేగంగా
జనావాసాల్లో బ్రతక లేనట్టు
వీళ్ళు మారరుగాక మారరు
నన్ను ప్రశాంతంగా ఉండనీరంటూ
రోజూ ఇదే గొడవ
కలిసే వాళ్లని విడగొడ్తూ
విడిన వారిని కలిపేస్తూ