ఎవరి తప్పు
ఎవరి తప్పు


రేయింబవళ్లు రెక్కాడితే
డొక్కాడికే చాలదురా
కన్న వాళ్ళు కనిన వాళ్ళు
ఊరులోన ఇన్నినాళ్ళు
విడిచి వచ్చి మేమంతా
సాధించిందేమిరా..
లాక్ డౌన్ కారణంగా
పనులేమీ లేక పోగా
పస్తులుండి మేం చేర్చిన
కాసులేమో ఖర్చయి
పోయినాదిరా...
మనవారితో కలసివుండి
గంజినీళ్ళు కాస్తయినా
తాగితే చాలురా అని
మన ఊరికి పోదామని
రైలు పట్టాలెంట నడిచినాము..
అలసి సొలసి పోయినాము
గాఢ నిద్ర కొరిగినాము
లేచి చూస్తే ఏముంది
ముత్తాతలతో ముచ్చటిస్తు ఉన్నాము..
ఎవరి తప్పు ఎవరి తప్పు
ఊహించడం మా తప్పు
మా తప్పుకు ఫలితమే
మా కుటుంబం వీధి పాలు..
గ్యాస్ పీల్చి ప్రాణం పొతే
కోటి రూపాయలిచ్చిండ్రు
పట్టాలమీద ప్రాణం పొతే
సానుభూతి తెలిపిండ్రు..
ఆత్మ హత్య కాదిది
తెలుసుకోండి అధికారులు
మా కుటుంబాలు నడివీధికి
రాకుండా
అందించండి చేయూతలు..