మా పల్లె
మా పల్లె
అక్కడ అనుబంధాలు అనుభవాలు పెనవేసుకుని
వేళ్ళూనుకున్న వట వృక్షం లా విస్తరిస్తాయి
ఆ కొమ్మలకు మమతానురాగాల ఆకులు గుత్తులుగా పూస్తాయి
మమకారాలు మొగ్గలు తొడుగుతాయి
అనంతమైన అవ్యాజమైన ఆప్యాయత ఎరువు వేసి
ప్రేమానురాగాల పంట ను పొందుతారు
మానవత్వమే తప్ప మత్తు మందులు, మాయాజాలాలు తెలియని
నిర్మలమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నా పల్లె
రచ్చబండ దగ్గర ఆవేశానురాగాల ఆత్మీయతా పరిష్కారాలే తప్ప
రచ్చ కీడ్చే కోర్టులంటే తెలీదు నా పల్లెకి
అపరిచితులను సైతం ఆదరించి అన్నం పెట్టె అన్నపూర్ణే గాని
కుట్టలు కుతంత్రాలు అర్ధం తెలియని ఆవు పాల స్వచ్చదనం నా పల్లె
జడివానైనా, జడిపించే మండే ఎండైనా అందరికీ నీడ నిచ్చే చెట్టులా
ఆపదల్లో ఆదుకునే ఆపద్భాంద వి నా పల్లె
పచ్చదనంతో మమేకమయ్యే అంగడులు జాతరలే తప్ప
క్లబ్బులు పబ్బులు తెల్వదు నా పల్లెకు
పరోపకారానికి ప్రతిరూపాలైన ఆవు , చెట్ల వోలె
పల్లెలోని ప్రతీది పర్యావరణానికి, పరులకు మేలు చేసేవే
చెట్లు మాట్లాడితే పర్యావరణ పరిరక్షణ చెబుతూ పచ్చని కన్నీరు కారుస్తది
పల్లె మాట్లాడితే ముంపు గ్రామాల వెతలు చెబుతూ కన్నీరు మున్నీరయితది
అయినా .....
కష్టాల్లో కన్నీరు తుడిచి కడుపుల పెట్టుకునే కన్నతల్లి కొంగులా
కనుమరుగవకుండా బంధాలకు నెలవై తల్లి పేగు బంధమయితది నా పల్లె
*********************
నామని సుజనదేవి