నాన్నంటే
నాన్నంటే


నాన్న.....
నీ గుండెలపై చిన్ని కాళ్ళతో తంతుంటే
మురిపెంగా ముద్దుపెట్టుకున్నావు
చిన్నతనం నుండే వేలుపట్టుకుని
మంచి బాట న నడిపించావు
తెలిసీ తెలియక వేసే
తప్పటడుగులు సరిదిద్దావు
చెప్పకనే మా అవసరాలను
గుర్తించి అన్నీ అందించావు
మాకు ఇష్టమైనవి ఇవ్వడానికి
నీకు కష్టమైనా ఇష్టంగా భరించావు
నువ్వు తీర్చుకోవాలనుకున్న ముచ్చట్లన్నీ
మాకు తీర్చి మురిసిపోయావు
నీ నిబద్ధతను, నిజాయితీని
క్రమశిక్షణను, కార్యదీక్షను, భక్తిని
మాకు వారసత్వంగా ఇచ్చావు
నీ కష్టానికి తగ్గ ఫలితమిచ్చే వేళ
నీ ఆశలను నెరవేర్చే వేళ
నీ ఆశయాలను అమలుపరిచే వేళ
నీ స్వప్నాలను సాకారం చేసే వేళ
నీ సర్వస్వం మాకు దారబోసి తృప్తి పొందావు
ముళ్ళ దారిలో బాట చేసి బాసటై నావు
మాకు కష్టాలోచ్చినపుడు కొండంత అండగా నిలిచి
అక్కున చేర్చుకున్నావు
ఎన్నో శుభవార్తలను ఆకస్మికంగా తెలియజేసి
విస్మయపరచడం ఇష్టమైన నిన్ను
ఒకేసారి అన్ని విజయాలతో ఉక్కిరిబిక్కిరి చేసి
విస్మయపరచాలని ఆశపడ్డాను
కానీ మా ఆశల్ని వమ్ము చేసి
మా కలల్ని కల్లలు చేసి
మాటకు అవకాశమివ్వక
మాకు తెలియని దారిలో నిష్క్రమించి
మౌనంగా శాశ్వతంగా విస్మయపరచి
కనుమరుగై ఆకాశంలో తారవైనావు
**********