ఆమే
ఆమే
ఆమే......!!
ఆమె
నారేతకో
కలుపు తీతకో
చీరని ఎగ్గట్టింది
నడుముని ఒంచి చేనున దిగింది
ఆబగా చూసే చూపు కొడవళ్ళ ధాటికి తట్టుకోలేక
ఇక ఆగిపోయింది....
ఆమె
అంట్లు తోమనో
బట్టలుతకనో
ఓ ఇంట పనికి కుదిరింది
యజమాని ఆకలి చూపులకు బలికాలేక
మరి సెలవు తీసుకుంది...
ఆమె
బ్యాగులు మోయడానికో
పిల్లోళ్ల చడ్డీలు మార్చడానికో
బడిలో అడుగుపెట్టింది
చదువుకున్న మారాజులు కార్చే చొంగలు తాళలేక
శాశ్వత నాగా పెట్టేసింది....
కట్టుకున్నోడు కల్లు దుకాణానికి
కడుపున పుట్టినోళ్లు ఆకలి రాజ్యానికి వలసపోతే
ఇంటాయన లేని ఆ గంట
మనసు చంపుకుంది.....
ఇల్లాలు 'బైట పడని'
వెలయాలు అవతారమెత్తింది....
కొలువుల వేటల్ని తప్పించుకుని
ఇంటి కత్తికి బలి అయిపోయింది....
ఉసూరు కుంపటిలో ఇంత కూడు ఉడకబెట్టింది....
సుధామురళి
