నా బాల్యం నాకిస్తారా?
నా బాల్యం నాకిస్తారా?


మీరడిగిన చదువులను
మీరు కోరిన ర్యాంకులను మీకిస్తాను
మరి నా బాల్యాన్ని నాకిస్తారా?
నులివెచ్చనిఅమ్మ ఒడిలో
తల్లిపాల కమ్మదనంతో
అమ్మజోల పారవశ్యం తో
ఆదమరచి నిద్రించే నా బాల్యపు మధుర జ్ఞాపకాన్ని
కేర్ సెంటర్ నుండి అరువడిగి నాకిస్తారా?
తెలిసీ తెలియని వయసులో
గారంగా మారాం చేయాలని
అమ్మ కొంగు పట్టుకుని అమ్మ కుచ్చిల్లలో
తలదాచుకుని దొంగచూపులు చూస్తూ
అనురాగాన్ని ఆస్వాదించాలనే నా బాల్యాన్ని
హాస్టల్ నుండి అనుమతి తీసుకుని నాకిస్తారా?
జ్వరంతో పడుకుంటే
అమ్మ ఒడే తలగడగా
అనుక్షణం అమ్మనంటి పెట్టుకుని
లాలింపు బుజ్జగింపుల్లో
చెడు మందులే అమృతధారలై
ఇష్టమైన వన్నీ అడిగి అడిగి
కొసరి కొసరి తినిపించే ‘
నా చిన్నతనాన్ని వార్డెన్ నడిగి నా కిస్తా రా?
ఉషోదయ తుషా రాలను
నదీ జలాల అందాలను
తోటివాళ్ళతో ఆడుకునే సరదాలని
తొలకరి జల్లుల పులకరింతలను
అన్నా చెల్లెళ్ళ గిల్లికజ్జాల ను
నాన్నమ్మ తాతయ్య ల లాలింపులను
పల్లవించే పసితనాన్ని
హాస్టల్ లో టీచర్నడి గి నాకిస్తారా?
మీరడిగిన ర్యాంకుల్ని మీకిచ్చాను
మరి నేనడిగినవి నా కివ్వరేం ?
*******